ప్రగతి నగర్ అంబీర్ చెరువుకు ముప్పు: కాలుష్యం, ఆరోగ్య ప్రమాదాలు, ఆక్రమణలు

కఠిన చర్యలు తీసుకోవాలంటూ పౌరుల డిమాండ్

Update: 2025-12-21 11:29 GMT

హైదరాబాద్, ప్రగతి నగర్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రగతి నగర్ జీవనాడిగా గుర్తింపు పొందిన అంబీర్ చెరువును పెరుగుతున్న కాలుష్యం, అక్రమ వ్యర్థాల నుంచి కాపాడాలని For a Better Society బృందం నేడు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. చెరువులోకి, పరిసర ప్రాంతాల్లో మాంసాహార వ్యర్థాలు, గృహ వ్యర్థాలు, వైద్య వ్యర్థాలు విచ్చలవిడిగా పడేయడంపై బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది పర్యావరణానికే కాదు, ప్రజారోగ్యానికి కూడా తీవ్రమైన ముప్పుగా మారిందని తెలిపింది.

విషపూరిత పొగతో ఆరోగ్య ప్రమాదాలు

ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, చెరువు సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న మాంసాహార విక్రయశాలలు, వీధి వ్యాపారులు వ్యర్థాలను నీటిలో వేయడమే కాకుండా థర్మాకోల్ బాక్సులను తగులబెడుతున్నారని చెప్పారు. దీనివల్ల వెలువడే విషపూరిత పొగను పీల్చడం ఆరోగ్యానికి హానికరమని, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారని గుర్తు చేశారు.

ఆక్రమణలతో ట్రాఫిక్ జామ్

మరోవైపు చెరువు పక్కన ఉన్న రహదారి ఇరుకుగా మారిందని, రోడ్డులో సగం భాగాన్ని అక్రమ స్టాళ్లు, వినియోగదారుల వాహనాల పార్కింగ్ ఆక్రమించేశాయని సామాజిక కార్యకర్తలు చెప్పారు. దీనితో రోజూ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఈ సమస్యలపై HYDRAA కమిషనర్  ఏ.వి. రంగనాథ్ కు బృందం అధికారిక విజ్ఞప్తి చేసింది. పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నవారిపై, ప్రజారోగ్యానికి హాని చేస్తున్నవారిపై, ట్రాఫిక్ ఆటంకాలకు కారణమవుతున్నవారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

అంబీర్ చెరువును రక్షించడం అంటే ఒక్క చెరువును కాపాడటమే కాదని, ప్రకృతిని కాపాడటం, ప్రజారోగ్యాన్ని భద్రపరచడం, పౌర క్రమశిక్షణను నెలకొల్పడమని బృందం స్పష్టం చేసింది. మరింత నష్టం జరగకముందే అధికారులు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Tags:    

Similar News