కోమాలోకి వెళ్ళిపోయింది.. ఉచితంగా లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసి బతికించారు

కాలేయం పూర్తిగా చెడిపోయి, కోమాలోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ పదిహేడేళ్ల బాలికకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేసి పునర్జన్మ ప్రసాదించారు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు.

Update: 2025-07-19 11:30 GMT

కాలేయం పూర్తిగా చెడిపోయి, కోమాలోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ పదిహేడేళ్ల బాలికకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేసి పునర్జన్మ ప్రసాదించారు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు. 24 గంటల్లోనే ఈ శస్త్రచికిత్స పూర్తిచేశారు. హైదరాబాద్‌ కు చెందిన బ్లెస్సీ గౌడ్‌ అనే బాలిక బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. తీవ్ర జ్వరం రావడంతో మే నెలలో ఆమెను తల్లి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించింది. ఆ తర్వాత ఆమె కోమాలోకి వెళ్లింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న బ్లెస్సీని మే 12న కుటుంబసభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బ్లెస్సీ కాలేయం పూర్తిగా పాడైపోయిందని గుర్తించారు. 48 గంటల్లోగా బ్లెస్సీకి కాలేయ మార్పిడి చేయాలని, లేదంటే ఆమె చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాలేయ దానానికి ఆమె తల్లి, కుటుంబసభ్యులు ముందుకొచ్చినా వారిలో ఎవ్వరి కాలేయం కూడా సరిపోలేదు. కాలేయదానం కోసం జీవన్‌దాన్‌ సూపర్‌ అర్జెంట్‌ కేటగిరిలో ఉస్మానియా వైద్యులు నమోదు చేశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి కాలేయం బ్లెస్సీ బ్లడ్‌ గ్రూప్‌తో సరిపోవడంతో జీవన్‌దాన్‌ దానిని బ్లెస్సీకి కేటాయించింది. ఆమెకు మే 14న డాక్టర్‌ మధుసూదన్‌ పర్యవేక్షణలో ఉస్మానియా వైద్య బృందం కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేసింది. రెండు వారాల తర్వాత బ్లెస్సీ కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి ఆమెను ఇంటికి పంపించారు. బ్లెస్సీకి పూర్తి ఉచితంగా లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశామని వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News