ఖజానా జ్యుయలరీస్ లో రెక్కీ చేసి మరీ...?
చందానగర్ ఖజానా జ్యుయలరీస్ లో దోపిడీకి యత్నించిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చందానగర్ ఖజానా జ్యుయలరీస్ లో దోపిడీకి యత్నించిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. నిందితుల నుంచి తుపాకీలతో పాటు తూటాలను కూడా పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. పక్క రాష్ట్రంలో జ్యుయలరీ దుకాణంలో పాల్పడిన నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫైరింగ్ చేసిన వారిని కూడా గుర్తించామని తెలిపారు. దీపక్, ఆశిష్ అనే నిందితులు బీహార్ లో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.
అనేక రాష్ట్రాల్లో....
ఈ బీహార్ గ్యాంగ్ పై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. బీహార్ తో పాటు మహారాష్ట్ర వంటి చోట్ల నేరాలకు పాల్పడ్డారని చెప్పారు. రెక్కీ పక్కాగా చేయడంతో పాటు జ్యుయలరీ దుకాణాలను మాత్రమే టార్గెట్ చేసే వారు. చందానగర్ జ్యుయలరీ దుకాణంలోనూ అలాగే రెక్కీ నిర్వహించారు. బీహార్ కు చెందిన ఆశిష్, దీపక్ లను అరెస్ట్ చేశామని పోలీసులు వివరించారు. దొంగల నుంచి గోల్డ్ కోటెడ్ జ్యుయలరీని కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బీహార్ గ్యాంగ్ అయినా వీరు ఇక్కడే ఉండి చోరీ చేసిన బంగారాన్ని విక్రయించేందుకు సిద్ధమవుతారని పోలీసులు తెలిపారు.
కర్ణాటకకు వెళ్లి అక్కడి నుంచి...
అయితే తెలివిగా వీరు ఖజానా జ్యుయలరీలో దోపిడీకి ప్రయత్నించిన తర్వాత వెండి సామాన్లతో రెండు ద్విచక్ర వాహనాలపై కర్ణాటక రాష్ట్రం వెళ్లినట్లు పోలీసులు గమనించి అందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించారు. అక్కడి నుంచి ఆరుగురు విడివిడిగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే దోపిడీకి పాల్పడిన వారిలో ఇద్దరిని పూణేలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ జ్యుయలరీ దుకాణాలు తెరిచెని వెంటనే, అలాగే దుకాణం మూసే సమయంలోనే దోపిడీకి పాల్పడటం అలవాటు అని పోలీసులు తెలిపారు.