Hyderabad : ఇళ్లలో నుంచి బయటకు రావద్దు.. హైదరాబాద్ లో మళ్లీ ఫ్లాష్ ఫ్లడ్స్
హైదరాబాద్ లో నేడు కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది
హైదరాబాద్ లో నేడు కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా తెలిపింది. ఉద్యోగులు, విద్యార్థులు వీలయినంత వరకూ తొందరగా ఇళ్లకు చేరుకోవాలని కోరింది. హైదరాబాద్ లో నిన్న కురిసిన వర్షానికి నగరం మునిగిపోయినంత పనయింది. ఈరోజు క్లౌడ్ బరస్ట్ జరిగే అవకాశముందని కూడా తెలిపింది. కుండపోత వర్షం నేడు కురవడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇబ్బందులు పడవద్దని హెచ్చరించింది.
అత్యధిక వర్షపాతం...
నిన్న హైదరాబాద్ లో అత్యధిక వర్షపాతం నమోదయింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం తట్టి అన్నారంలో 127.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ముషీరాబాద్ లో 121 మిల్లీ మీటర్ల వర్షపాత ంకురిసింది. జవహర్ నగర్ లో 112 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదయిందని అధికారులు తెలిపారు. నాలాలు పొంగాయి. రహదారులపైకి నీరు చేరింది. అపార్ట్ మెంట్లు, లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది. నిన్న కురిసిన వర్షానికి ముగ్గురు నాలాలో కొట్టుకుని పోయి మరణించారు. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు.
ఈరోజు వర్క్ ఫ్రం హోం చేయాలంటూ..
ఈరోజు కూడా భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ సూచన మేరకు పోలీసులు సాఫ్ట్ వేర్ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం చేయాలని కోరారు.ఆఫీసులకు వచ్చి ఇరుక్కుపోవద్దని తెలిపారు. అలాగే సాయంత్రం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎండలు కాస్తుండటంతో పాటు సాయంత్రానికి కుండపోత వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీలయినంత త్వరగా ఇళ్లకు చేరుకుని క్షేమంగా ఉండేందుకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. సొంత వాహనాలను కాకుండా ప్రజారవాణాను వినియోగించుకోవాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు.