Hyderabad : ఎటు చూసినా నీరే.. హైదరాబాద్ ను వణికించిన వర్షం...మళ్లీ క్లౌడ్ బరస్ట్
హైదరాబాద్ లో వర్షం వణికిస్తుంది. ప్రతిరోజూ సాయంత్రం అయ్యేసరికి వర్షం కుమ్మేస్తుంది. కుండపోత వర్షం కురుస్తుంది.
హైదరాబాద్ లో వర్షం వణికిస్తుంది. ప్రతిరోజూ సాయంత్రం అయ్యేసరికి వర్షం కుమ్మేస్తుంది. కుండపోత వర్షం కురుస్తుంది. రాత్రి కురిసిన వర్షానికి బల్కంపేట్ లో ఒక యువకుడు మృతి చెందాడు. ముషీరాబాద్ కు చెందిన మహ్మద్ షరఫుద్దీన్ బల్కంపేట్ అండర్ పాస్ బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనంపై వస్తూ కొట్టుకుపోయాడు. స్థానికులు చూసి కూడా అతనిని రక్షించలేని పరిస్థితి ఉంది. నిన్న రాత్రి అత్యధిక వర్షపాతం నమోదయింది. ఒక్కసారి వర్షంపడటంతో ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే వారు తీవ్ర అవస్థలు పడ్డారు. దీంతో అనేక చోట్ల వాహనాలు రోడ్డుమీదనే నిలిచిపోయాయి. నగరం మొత్తం ట్రాఫిక్ తో స్థంభించిపోయింది. అక్కడా.. ఇక్కడా అని లేకుండా అన్నిచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
రహదారులపైకి నీరు...
కుండపోత వర్షంతో రహదారులపైకి నీరు చేరడమే కాకుండా డివైడర్ కూడా కనిపించకపోవడంతో కొందరు వాటిని గుద్దుకుని కిందపడ్డారు. అత్యధికంగా ముషీరాబాద్ లో రాత్రి 18.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గచ్చిబౌలి, మాదాపూర్, మొహిదీపట్నం, లక్డీకాపూల్, అమీర్ పేట్, కూకట్ పల్లి, చందానగర్, ఉప్పల్, ఆబిడ్స్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. వివిధ ప్రాంతాలకు బయలుదేరిన బస్సులతో పాటు అనేక వాహనాలు రోడ్లపై గంటల తరబడి నిలుచున్నాయి. గంటల పాటు రోడ్డుపైనే ఉండి వర్షంలో తడిసి ముద్దవుతూ కష్టాల పాలయ్యారు.
నేడు కూడా భారీ వర్ష సూచన...
రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మొదలయిన వర్షం అర్ధరాత్రి వరకూ ఏకధాటిగా పడింది. దీంతో అసలు ఇళ్లకు సురక్షితంగా చేరగలమా? అన్న సందేహంలో చాలా మంది వాహనదారులు, ప్రజలు వణికపోయారు. ఉరుములు, మెరుపులతో పాటు భారీ వర్షం పడటంతో క్లౌడ్ బరస్ట్ నగరాన్ని అతలాకుతలం చేసింది.దీంతో ముషీరాబాద్ లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. బేగంపేట్ లో కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో విద్యుత్తు శాఖ అధికారులు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఉదయం నుంచి నీళ్లను తోడేందుకు కాలనీవాసులు శ్రమిస్తున్నారు.ఈరోజు కూడా భారీ వర్షం పడే అవకాశముందని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.