నకిలీ ఐపీఎస్ గుట్టురట్టు.. దొరికిన వాళ్లందరినీ దోచేశాడు

ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా నగరానికి వచ్చిన కార్తీక్ ముందుగా ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేశాడు. అక్కడ నాలుగు వాహనాలను

Update: 2023-05-24 14:09 GMT

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ IPS/కల్నల్ ను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ పోలీసు బృందాలు నిందితుడి వద్ద రూ. 2,00,000 విలువైన 7.65 కంట్రీ మేడ్ పిస్టల్, 9 లైవ్ రౌండ్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎస్ చిహ్నం, పోలీసు యూనిఫారాలు, ఢిల్లీ, తెలంగాణ పోలీసుల ఐడీ కార్డులు, ఆర్మీ బ్యాడ్జీలు, హ్యాండ్‌కఫ్‌లు, మొబైల్ ఫోన్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా చిక్కాల గ్రామానికి చెందిన 25 ఏళ్ల నాగరాజు కార్తీక్ రఘువర్మ అలియాస్ కార్తీక్‌గా గుర్తించారు. అతను తన స్వగ్రామంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, 2016 సంవత్సరంలో భీమవరంలోని SRK డిగ్రీ కళాశాలలో BA డిగ్రీ పూర్తి చేసి ఆపై హైదరాబాద్‌కు వచ్చాడు. ఐపీఎస్ ఆఫీసర్‌ను, ఆర్మీ మేజర్‌ను అంటూ ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారంతో మాదాపూర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఆధ్వర్యంలో రామ్ ఐపీఎస్ పేరుతో చలామణి అవుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ శ్రీనివాస్ వివరించారు.

ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా నగరానికి వచ్చిన కార్తీక్ ముందుగా ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేశాడు. అక్కడ నాలుగు వాహనాలను దొంగతనం చేయడంతో కేసు నమోదు అయింది. అనంతరం ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్ దగ్గర పనిచేస్తూ అతని వెహికిల్‌ను కూడా దొంగతనం చేయడంతో మరోసారి కేసు నమోదు అయింది. దీంతో అతడికి ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. ఆ తర్వాత ఒక సెక్యూరిటీ కంపెనీలో జాబు సంపాదించిన కార్తీక్ అక్కడే పనిచేస్తున్న మాజీ ఆర్మీ అధికారితో పరిచయం పెంచుకుని ఆర్మీ అధికారులు, వాళ్ల బ్యాడ్జీలు, హోదాలు ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకున్నాడు. రామ్ ఐపీఎస్ పేరుతో తెలంగాణ, ఏపీ, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతూ వచ్చాడు. సెటిల్‌మెంట్ల పేర్లతో మోసాలు చేస్తున్నాడు. సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో ఏకంగా కార్యాలయమే తెరిచి బాధితులను కార్యాలయానికి పిలిపించి సెటిల్‌మెంట్స్ చేస్తున్నాడు. బాధితులకు ఇంటరాగేషన్ పేరుతో పోలీసుల స్టైల్ చుక్కలు చూపెట్టాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళను తక్కువ ధరకు వాహనాలు ఇప్పిస్తానని ఝార్ఖండ్ తీసుకువెళ్లి ఆమె వద్ద రూ.9 లక్షలు తీసుకుని మోసం చేశాడు. బాధిత మహిళ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రామ్ ఐపీఎస్ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. జైలు నుండి వచ్చిన తర్వాత తిరిగి భారీగా నేరాలు చేయడం ప్రారంభించాడు. మేకా రవిశంకర్ అనే వ్యక్తి జాబ్స్ ఇప్పిస్తానని మోసం చేస్తున్నాడని తెలుసుకుని అతన్ని కిడ్నాప్ చేసి అతని హౌస్‌ను కార్తీక్ తన పేరున రాయించుకున్నాడు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, ఎంఎస్ ధోనీతో ఉన్నట్లు ఫోటోలు మార్ఫింగ్ చేసి అతని ఊరి వారిని, స్నేహితులను నమ్మించాడు. ఊర్లో కార్తీక్‌కు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పిల్లలకు రోల్ మోడల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. కార్తీక్ నార్త్ ఇండియన్ హిందీ యాక్సెంట్ కూడా బాగా మాట్లాడంతో అందరూ నిజమైన అధికారిగా భావించారు.నిందితుడిపై ఆయా పోలీసు స్టేషన్‌లలో 10 నుండి 15 కేసులు ఉన్నాయి. పలు సందర్భాల్లో పోలీస్ విచారణ పేరుతో చాలామందిని చిత్రహింసలకు గురిచేశాడు. సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు నకిలీ ఐపీఎస్ రామ్‌ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

ఊర్లో ఏకంగా డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు:
ఏకంగా నకిలీ డిఫెన్స్ సెంటర్ ను నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అతను తన గ్రామాలకు తిరిగి వెళ్లి, PARASF రెజిమెంట్‌లో మేజర్‌గా ఎంపికయ్యాడని, తనను తాను ఆర్మీ ఆఫీసర్‌గా చెప్పుకున్నాడు. నిరుద్యోగ యువతను సేకరించి, చట్టవిరుద్ధంగా సైనిక్ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్‌ను స్థాపించి వారికి ఆర్మీ శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అతడిని నకిలీ ఆర్మీ అధికారిగా అనుమానించిన స్థానిక పోడూరు పోలీసులు, ఆర్మీ అధికారులతో కలిసి చాకచక్యంగా విచారణ జరిపి అరెస్ట్ చేసి జైలుకు పంపారు.


Tags:    

Similar News