Rain Alert : హైదరాబాదీలూ...ఇళ్లలోనే ఉండండి.. బయటకు వస్తే ముప్పే.. హై అలెర్ట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వాగులు, నదులు పొంగి పొరలే అవకాశముందని, నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపింది. అదే సమయంలో ప్రయాణాలు అత్యవసరమైతే తప్ప చేయవద్దని హెచ్చరించింది. హైదరాబాద్ కు మరో ఇరవై నాలుగు గంటల ముప్పు తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రానున్న ఇరవై నాలుగు గంటల్లో...
రాగల 24 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో 21 సెం.మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పది హేడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. మిగలిన 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నాన్‌స్టాప్ వర్షానికి హైదరాబాద్ విలవిలలాడుతోంది. నగరంలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూసీ పొంగి ఎంజీబీఎస్‌ను ముంచెత్తిన వరద నీటితో బస్ స్టేషన్ ను మూసివేశారు. మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ లోయర్ బ్రిడ్జిల పై నుంచి వరద.. మూసీ తీరంలోని పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు ప్రవేశించింది. మూసీ ఉధృతితో భయాందోళనలో ప్రజలు న్నారు.
రోడ్డు మీదకు వస్తే...
నిండుకుండలా జంట జలాశయాలు మారిపోయాయి. భారీ వర్షాలతో వరద పోటెత్తింది. వరద ఉధృతితో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గేట్లు తెరిచి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఉధృతంగా మూసీ నది ప్రవహిస్తుండటంతో చాదర్ ఘాట్ లోయర్ బ్రిడ్జి మూసివేశారు. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో పెరిగిన వరదతో ఎంజీబీఎస్ కు వెళ్లే రెండు బ్రిడ్జిలు నీట మునిగాయి.ఎంజీబీఎస్ కు వచ్చే బస్సులను అధికారులు దారి మళ్లించారు. ఎంజీబీఎస్ వద్ద ఒకవైపు రోడ్డు మొత్తం మూసేవేశఆరు. పలు బస్సులకు జేబీఎస్ వరకే అనుమతించారు. మరో రెండు గంటల్లో భారీ వర్షం పడుతుందన్న హెచ్చరికలతో హైదరాబాద్ వాసులు వణికిపోతున్నారు. ఈ వర్షం నుంచి గట్టెక్కించాలని కోరుకుంటున్నారు.