Hyderabad : హైదరాబాద్ లో కర్ఫ్యూ వాతావరణం.. ఇటు రావద్దు
హైదరాబాద్ లో మరోసారి కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో ముసారాంబాగ్ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు
హైదరాబాద్ లో మరోసారి కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో ముసారాంబాగ్ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. ముసారాంబాగ్ వంతెన మీదుగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపేశారు. దీంతో అటు వెళ్లే వాహనదారులు తిరిగి వెళ్లాలని పోలీసులు అక్కడ కాపలా ఉండి మరీ చబుతున్నారు. చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఎవరూ ఫొటోలు తీసుకోవడానికి కూడా అనుమతించడం లేదు. మరొకవైపు మూసీ నదిపరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాయుగుండం రేపు తీరం దాటే అవకాశముండటంతో రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
పురాతన భవనాల నుంచి...
దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ వర్షాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎక్కడ ఇబ్బందులు ఎదురైనా వెంటనే దానిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇప్పటికే గుర్తించిన పురాతన భవనాలలో నివాస ముంటున్న వారిని కూడా ఖాళీ చేయించాలని సూచించారు. ప్రమాదం జరగకముందే అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్కడ అవసరమైతే విద్యుత్తు సరఫరాను కూడా నిలిపేయాలని కూడా ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలుంటాయని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో వాగులను...
నగరంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. ఇక పండగ కోసం సొంతూళ్లకు వెళ్లేందుకు బయలుదేరే అవకాశముంది. దసరాకు ఇప్పటికే వెళ్లిన వారు కొందరయితే. మరికొందరు రేపటి నుంచి దసరా పండగకు సొంత గ్రామాలకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నందున ఆర్టీసీ బస్సులు కూడా జాగ్రత్తగా నడపాలని టీజీ ఆర్టీసీ అధికారులు కోరారు. ప్రయాణికులు వత్తిడి తెచ్చినంత మాత్రాన వాగుల నుంచి బస్సులను దాటించే ప్రయత్నం చేయవద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తమయింది. హైదరాబాద్ లో ఉంటున్న వారు తమ బంధువులను దసరా పండగ కోసం హైదరాబాద్ కు రావద్దని ఫోన్లు చేసి చెబుతున్నారు.