Hyderabad : రెండు గంటలు ఎక్కడున్న వాళ్లు అక్కడే ఉండండి.. హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం పడుతుంది. మరో రెండు గంటలు ఎవరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

Update: 2025-09-22 11:52 GMT

హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం పడుతుంది. మరో రెండు గంటలు ఎవరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మళ్లీ ఈరోజు సాయంత్రం కూడా క్లౌడ్ బరస్ట్ జరిగిందని అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం వరకూ భారీగా ఉష్ణోగ్రతలు నమోదయి, ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని కుండపోత వర్షం మొదలయింది. దంచి కొడుతున్న వర్షంతో నగరవాసుల్లో దడ మొదలయింది. ఆఫీసుల్లో ఉన్న వారు మరో రెండు గంటల పాటు ఆఫీసుల్లోనే ఉండాలని అధికారులు తెలిపారు. హైదరాబాద్ కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. నిమిష నిమిషానికి వర్షపాతం పెరుగుతుండటంతో ఎవరూ బయటకు రావద్దంటూ అధికారులు ప్రజలను కోరుతున్నారు. క్యుమలోనింబస్ మేఘాలతో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రహదారులన్నీ జలమయం...
కేవలం అరగంటలోనే వర్షం దంచి కొట్టడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ట్యాంక్ బండ్, బషీర్ బాగ్, మాదాపూర్, జూబ్లీహిల్స్, మొహిదీపట్నం, టోలీచౌకి, లక్డీకాపూల్, అమీర్ పేట్, ఎస్.ఆర్.నగర్, కూకట్ పల్లి, చందానగర్, మియాపూర్, ఉప్పల్, నాగోల్, ఆబిడ్స్ , మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ వరకూ భారీవర్షం పడుతుంది. భారీ వర్షంతో నాలాలు ఉప్పొంగుతున్నాయి. రోడ్లపైకి మోకాలి లోతు నీరు చేరింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కార్యాలయాల నుంచి బయలుదేరే సమయం కావడంతో ఎవరూ బయటకు రావద్దని రెండు గంటలు దాటిన తర్వాత మాత్రమే ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.
నీరు తగ్గిన తర్వాతనే...
సోమవారం కావడంతో ఎక్కువ మంది ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో చిక్కుకుపోయారు. ఈ మధ్య తరచూ సాయంత్రం వేళ వర్షం పడుతుండటంతో అందరూ మెట్రో రైళ్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే గతంలో నాలాల్లో పడి కొందరు మరణించడంతో జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఏర్పడి అందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రహదారులపై నీరు నిలిచి ఉన్న చోట ప్రయాణం చేయవద్దని ఎక్కడైనా కొద్ది సేపు ఆగి నీటి ఉధృతి తగ్గి రోడ్డు కనిపించిన తర్వాత మాత్రమే ఇంటికి బయలుదేరాలని చెబుతున్నారు. సాయంత్రం అయితే చాలు హైదరాబాద్ వాసులను వరుణుడు వణికిస్తున్నాడు. దంచికొడుతున్న వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Tags:    

Similar News