Hyderabad : బోసిపోయిన హైదరాబాద్... కర్ఫ్యూ విధించినట్లుగానే?
దసరా పండగకు జనం ఊరెళ్లడంతో హైదరాబాద్ నగరం బోసి పోయింది. ఒక రకంగా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది
దసరా పండగకు జనం ఊరెళ్లడంతో హైదరాబాద్ నగరం బోసి పోయింది. ఒక రకంగా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. తెలంగాణలో దసరా అది పెద్ద పండగ కావడంతో దాదాపు సగం నగరం ఖాళీ అయింది. దీంతో వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దసరా సెలవులు దాదాపు పదమూడు రోజులు ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఇక ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు కూడా పల్లె బాట పట్టారు. గురువారం దసరా సెలవు దినం. శుక్రవారం ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే శని, ఆదివారాలు కూడా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఎక్కువ మంది లాంగ్ టూర్లకు ప్లాన్ చేసుకున్నారు. మొత్తం నాలుగు రోజులు సెలవులు రావడంతో కొందరు తమ స్వగ్రామాలకు బయలుదేరి వెళ్లారు.
ట్రాఫిక్ సమస్య లేకుండా...
దీంతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కడా కనిపించడం లేదు. హోటళ్లు, వ్యాపార దుకాణాలన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. దసరా సెలవులకు విద్యాసంస్థలు కూడా సెలవులు కావడంతో వాటికి సంబంధించిన బస్సులు కూడా కనిపించకపోవడంతో రద్దీ తగ్గింది. అదే సమయంలో తెలంగాణలోని చిరు వ్యాపారులు కూడా పండగకు తమ సొంత వాహనాలలో గ్రామాలకు బయలుదేరి వెళ్లారు. నిన్నటివరకూ భారీ వర్షాలు కురియడంతో ఇబ్బంది పడిన ప్రజలు దసరా పండగను సెలబ్రేట్ చేసుకునేందుకు గ్రామాలకు బయలుదేరి వెళ్లారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి మాల్స్ వరకూ బోసి పోయి కనిపిస్తున్నాయి. ఇక ఆదివారం తిరుగ ప్రయాణం కానున్నారు.
బోసిపోయి కనిపిస్తూ...
హోటళ్లు కూడా బోసి పోయి కనిపిస్తున్నాయి. గతంలో సంక్రాంతికి మాత్రమే ఇలాంటి తరహా దృశ్యాలు కనిపించేవి. కానీ దసరాకు కూడా ఎక్కువ మంది ప్రజలు సొంతూళ్లకు బయలుదేరి వెళుతుండటంతో నగరం మొత్తం బోసి పోయి కనిపిస్తుంది. చాలా దుకాణాలను తెరుచుకోలేదు. కూరగాయల మార్కెట్ ను కూడా బంద్ చేశారు. పండ్ల మార్కెట్ లో కూడా కోలాహలం కనిపించడం లేదు. దసరా పండగకు కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రాంత ప్రజలు కూడా బయలుదేరి వెళ్లారు. వరస సెలవులు రావడంతో పాటు ఎక్కువ రోజులు గడిపేందుకు సొంతూళ్లలో వీలుండటంతో ప్రజలు ఏపీకి బయలుదేరి వెళ్లారు. ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.