Hyderabad : నీట మునుగుతున్న నగరం ... బెంగళూరుతో పోటీ పడుతుందిగా?
వర్షం కురిస్తే నగరం మునిగిపోవడంలో హైదరాబాద్ బెంగళూరును మించిపోయేలా కనిపిస్తుంది.
హైదరాబాద్ నగరం బెంగళూరు నగరానికి ఏ మాత్రం తీసిపోవడం లేదు. ఇన్నాళ్లు బెంగళూరును చూసి నవ్వుకున్నవాళ్లు నేడు హైదరాబాద్ ను చూసి ఏడుపు లంకించుకునే పరిస్థితి వచ్చింది. కొద్ది రోజులు ఆగితే బెంగళూరును మించి పోతుంది.. ఐటీలో కాదండోయ్... వర్షం కురిస్తే నగరం మునిగిపోవడంలో హైదరాబాద్ బెంగళూరును మించిపోయేలా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు. మూసీ నది ప్రక్షాళన జరపాలన్నారు. నాలాలు, చెరువుల ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రాను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆక్రమణలు తొలిగించాలంటే రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. ఆక్రమణలు తొలిగిస్తామంటే విమర్శలు, సవాళ్లను పాలకులు ఎదుర్కొనాల్సి వస్తుంది.
ఎన్నడూ లేని విధంగా...
గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ చినుకు పడితే వణికిపోతుంది. నగరం మొత్తం నీటిమయంగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం ఆక్రమణలే. నిజాం కాలం నాటి నాలాల నిర్మాణాలు. హైడ్రా అధికారులు అప్పటికీ కొన్ని చోట్ల ఆక్రమణలను తొలగించినప్పటికీ మళ్లీ రాజకీయ జోక్యంతో షరా మొదలయింది. హైదరాబాద్ నగరంలో దాదాపు 90 శాతం మునిగిపోతుందంటే ఎవరు కారణమో వేరే చెప్పాల్సిన పనిలేదు. అనేక చోట్ల ముంపు కాలనీలను అధికారులు గుర్తించారు. అక్కడ ఏమేం చర్యలు తీసుకోవాలో నిర్ణయించినప్పటికీ అది ఏ మేరకు ఫలితం సాధిస్తాయన్నది మాత్రం చెప్పలేం. ఎందుకంటే నాలాల్లో వ్యర్థపదార్థాలతో పాటు ప్లాస్టిక్ వస్తువులు కూడా ఉండిపోయి నీరు వెళ్లకుండా అడ్డుపడుతున్నాయి.
బయటకు వెళ్లాలంటే...
ఇక ఐటీ ఉద్యోగులు భారీ వర్షానికి ఆఫీసులకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఆశించినంతగా అందుబాటులో లేదు. బస్సులు, క్యాబ్ లు ఎక్కినా ఎటువంటి ప్రయోజనం లేదు. ఒకే ఒక ప్రత్యామ్నాయం మెట్రో. మెట్రో ప్రయాణమంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఒక సమయం లేకుండా, వారం లేకుండా రైళ్లన్నీ కిక్కిరిసి నడుస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ లో హైదరాబాద్ లో జీవనం మరింత నరకం కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పాలకుల ఆలోచనలకు, అమలు చేసే కార్యక్రమాలకు అడ్డుతగలకుండా విపక్షాలు మద్దతిస్తే కొంత వరకూ హైదరాబాద్ తేరుకునే అవకాశాలున్నాయి. అలాగే రాజకీయం కంటిన్యూ అయితే మాత్రం నగరం బాగుపడే అవకాశాలు లేవన్నది మాత్రం సుస్పష్టం.