Hyderabad : హైదరాబాద్ స్థిరాస్థి వ్యాపారంలో ఊగిసలాట.. అమ్మకాలు ఇంత తగ్గడంతో?
హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పడిపోయాయి
హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే దాదాపు ఇరవై ఆరు శాతం అమ్మకాలు పడిపోయినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ప్ ప్రాప్ టైగర్ తెలిపింది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై పడిందంటున్నారు. గ్రీన్ కార్డులతో పాటు అక్కడ భారతీయ విద్యార్థులతో పాటు తెలుగు విద్యార్థులు ట్రంప్ తెచ్చిన ఆంక్షలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో భారీ మొత్తాన్ని వెచ్చించి రియల్ ఎస్టేట్ పై పెట్టుబడులు పెట్టడం మంచిది కాదని కొందరు భావించి కొనుగోలు చేయడం లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.
స్థిరాస్థి వ్యాప్యారం...
హైదరాబాద్ లో స్థిరాస్థి వ్యాపారం ఎప్పుడూ సజావుగానే సాగుతుంటుంది. అనేక కారణాలతో ఎక్కువ మంది హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవవడానికి, విదేశాల్లో ఉన్న వారు సయితం ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కానీ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తలెత్తిన ఇబ్బందులతో ఇప్పుడు ఆ ప్రభావం రియల్ వ్యాపారంపై పడిందంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా రియల్ ఎస్టేట్ పై ప్రభావం చూపాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక వెంచర్లు నిర్మాణాలు పూర్తయి నిలిచిపోయి ఉన్నాయని, ఇందుకు కారణాలు మాత్రం అనేకమని వారు ఆవేదన చెందుతున్నారు.సాఫ్ట్ వేర్ రంగంలో ఒడిదుడుకులు కూడా అమ్మకాలు తగ్గడానికి కారణాలంటున్నారు.
గణాంకాలు ఇలా...
కనీసం తాము అప్పులు చేసిన దానికి వడ్డీని కూడా చెల్లించలేకపోతున్నామని రియల్ వ్యాపారులు అంటున్నారు. గత ఏడాది జనవరి నుంచి మార్చి నెల మధ్య `14,298యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరగగా, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెల మధ్య కేవలం 10,647 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు మాత్రమే జరిగాయని తెలిపింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఇరవై ఆరు శాతం ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్ లో తగ్గాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్ టైగర్ సంస్థ తెలిపింది. దీంతో పాటు ఒకవైపు మాత్రమే నగరం అభివృద్ధి చెందుతుండటం కూడా రియల్ వ్యాపారంపై పడిందంటున్నారు. ఇదే సమయంలో బెంగళూరులో పదమూడు శాతం, చెన్నైలో ఎనిమిది శాతం అమ్మకాలు పెరిగినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రభుత్వం ఇప్పటికైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.