Hyderabad : ట్రాఫిక్ సమస్య చెక్ కు కొత్త పంథా.. హైదరాబాదీలకు అలెర్ట్
హైదరాబాద్ లో చిన్న పాటి వర్షం కురిస్తే చాలు ఇక ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. ఎక్కడికక్కడ గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి
హైదరాబాద్ లో భారీ వర్షం కురిస్తే చాలు ఇక ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. ఎక్కడికక్కడ గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. వాహనాలు మరమ్మతులకు గురికావడంతో పాటు వేలాది లీటర్ల పెట్రోలు కూడా వృధాగా ఆవిరవుతుంది. హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు, కొంత వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు తరహాలోనే ముందుగా సమాచారం అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే బెంగళూరులో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దానిని అనుసరించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలోనే దానిని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
రోడ్లపైన నీరు నిలిచే ప్రాంతాలు...
హైడ్రా అధికారులతో పాటు తెలంగాణ డెవలెప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ కలసి ఈ ప్రయత్నాలను మొదలుపెట్టాయి. భారీ వర్షం కురిసినప్పుడు రోడ్లపై ఎక్కువగా నీరు నిలిచే ప్రాంతాలతో పాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే అధికారులు గుర్తిస్తారు. ఆ ప్రాంతానికి వెళ్లవద్దంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేయనున్నారు. ఎంత సేపు వరద ప్రభావం ఉంటుంది ముందుగానే తెలియజేయడంతో వాహనదారులు తమ కార్యాలయాల్లోనే వేచి ఉండే అవకాశముంటుందని భావిస్తున్నారు. అలాగే వివిధ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు కూడా భారీ వర్షం పడినప్పుడు బయటకు రాకుండా అక్కడే ఉండేందుకు ఈ చర్య దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఇళ్లకు బయలుదేరే సమయంలోనే...
ప్రధానంగా సాయంత్రం వేళ వర్షం అధికంగా కురుస్తుండటంతో పాటు కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరే సమయం కావడంతో ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి వస్తున్నారు.రహదారులపై నీరు నిలిచి ఉండటంతో వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిని పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీసుల వల్ల కూడా కావడం లేదు. వేల సంఖ్యలో వాహనాలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో వాటిని క్రమబద్ధీకరించేందుకు కూడా తీసుకుంటున్న పోలీసుల చర్యలు ఎలాంటి ఫలితాలు ఇవ్వడం లేదు. నాలాలు పొంగి రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాలు వెళ్లడం లేదు. గంటల పాటు ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నారు.
పదిహేను నిమిషాలకు ఒకసారి...
దీంతో పడిన వాన వెళ్లిపోయేంత వరకూ వాహనాలతో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఇంత పెద్దయెత్తున ట్రాఫిక్ సమస్యలు ఉండవని అధికారులు భావిస్తున్నారు. కొన్ని గంటల పాటు రోడ్డుపై వాహనాల్లో ఉండే కంటే తమ కార్యాలయాల్లోనే ఉండి కాస్త ఆలస్యమయినా సులువుగా ఇంటికి చేరుకోవచ్చన్న సూచనను చేయనున్నారు. అందుకే వాతావరణ శాఖ చేసిన సూచన అనుసరించి ఇకపై ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి ప్రజలను వర్షంపై అప్రమత్తం చేయడంతో పాటు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటే చాలా వరకూ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. వర్షం కురిసి వెలసిన తర్వాత ఎంతసేపటికి బయటకు రావాలన్నది సూచించనున్నారు.