Hyderabad : రోడ్డు మీదే గంటల తరబడి నిరీక్షణలు.. ఈ జంక్షన్ల వద్ద ఆగారంటే ఇక అంతే?

హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరసగా వర్షాలు కురుస్తుండటంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2025-09-19 04:42 GMT

హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరసగా వర్షాలు కురుస్తుండటంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ఫైఓవర్లు నిర్మించినాఎన్ని సబ్ వేలు ఏర్పాటు చేసినా ఫలితం లేదు. మెట్రో సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. అదే సమయంలో ఇక వర్షం పడితే మామూలుగా ఉండదు. జంక్షన్ల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుంది. రోడ్లపైకి నీరు చేరుతుండటంతో పాటు వాహనాలు బంపర్ టు బంపర్ గా వెళుతుండటంతో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నారు. అనేక వాహనాలు వర్షపు నీరు కారణంగా నిలిచిపోయి మొరాయిస్తుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది.

భారీ వర్షాలకు...
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగర వాసులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో దాదాపు 90 లక్షల వాహనాలున్నట్లు ఆర్టీఏ లెక్కలు చెబుతున్నాయి. వాహనాలు ఒక్కసారిగా రోడ్డు పైకి రావడం వల్ల, వర్షం కురియడం వల్ల జంక్షన్ లో పెద్దయెత్తున జామ్ అవుతుంది. గత రెండు రోజులుగా వర్షం ధాటికి అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. కేవలం వర్షం పడితేనే కాదు.. మామూలు రోజుల్లోనూ ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. సిగ్నలింగ్ వ్యవస్థ పెట్టినప్పటికీ గంటల తరబడి తమ గమ్యస్థానానికి చేరుకోవాల్సి వస్తుంది. ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలు అన్నీ రోడ్లపైకే వస్తుండటంతో కాలుష్యం కూడా భారీగా పెరుగుతుందంటున్నారు.
ఈ జంక్షన్లలో...
ఎల్.బి.నగర్ నుంచి కూకట్ పల్లికి వెళ్లే లోపు ఎల్.బి.నగర్ నుంచి విజయవాడకు తక్కువ సమయంలో చేరుకోవచ్చన్న సెటైర్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఎల్. బి.నగర్ జంక్షన్, మలక్ పేట జంక్షన్, నల్లగొండ చౌరస్తా, మొజంజాహి మార్కెట్, నాంపల్లి, ఆబిడ్స్, అసెంబ్లీ, లక్డీకాపూల్, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, మాదాపూర్ వరకూ ఇటు కొండాపూర్, హైటెక్ సిటీ, ఐకియా సెంటర్, మొహిదీపట్నం జంక్షన్, బంజారాహిల్స్ వంటి జంక్షన్లలో ప్రతి రోజూ వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. హైదరాబాద్ లో కూడా ట్రాఫిక్ తో పాటు కాలుష్యం తగ్గించాలంటే ఢిల్లీ తరహాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, సరి, బేసి విధానంలో వాహనాలను రోడ్డు పైకి తీసుకువస్తే తప్ప ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టే అవకాశం లేదంటున్నారు.


Tags:    

Similar News