Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం.. రెండు రోజుల నుంచి జోరువాన
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం రాత్రి ప్రారంభమయిన వర్షం నేడు కూడా కొనసాగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో అనేక ప్రాంతాల్లో నీరు నిలిచి పోయింది. పలు చోట్ల రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ కు సమస్యగా మారింది.
ఉద్యోగాలకు వెళ్లేవారు...
ఈరోజు విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కావడంతో పాటు ఉద్యోగాలకు వెళ్లే వారు కూడా అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేని వాన దంచికొడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో రాత్రంతా జాగారం చేస్తూనే ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ సిబ్బంది సయితం రహదారులపై చేరిన నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. మ్యాన్ హోల్స్ మూతలను ఎవరూ తెరవవద్దని చెబుతున్నారు. మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో ఇంటికే పరిమితమవ్వాలన్న హెచ్చరికలను అధికారులు జారీ చేస్తున్నారు.
విద్యుత్తు సరఫరాకు అంతరాయం...
మరొకవైపు హైదరాబాద్ నగరంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. ఇటీవల కేబుల్ లైన్లతో పాటు నెట్ వైర్లు కూడా తొలగించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వైర్లను కొన్ని ప్రాంతాల్లో తొలగించడంతో ఇంటర్నెట్ కనెక్షన్ కోల్పోయినట్లు పలు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. అదే సమయంలో వినాయక మండపాల్లోకి కూడా నీరు చేరడంతో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మండపాల వద్ద విద్యుత్తు కనెక్షన్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఎవరూ సొంతంగా కాకుండా విద్యుత్తు సిబ్బందితో మాట్లాడి తగిన సూచనలు తీసుకోవాలంటున్నారు. అదే సమయంలో పురాతన భవనాల్లో నివసించే వారు సయితం ఖాళీ చేయాలని కూడా జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మూడు రోజుల నుంచి పడుతున్న వానకు తడిసి పురాతన భవనాలు కూలే ప్రమాదముందని ముందస్తు సూచనలు చేస్తున్నారు.