Hyderabad : హైదరాబాద్ లో ఈరోజు ఎవరూ బయటకు రావద్దు.. క్లౌడ్ బరస్ట్ అయినట్లే
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఉదయం కూడా వర్షం ఆగలేదు. దీంతో ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. అనేక చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై మోకాళ్ల లోతుల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇళ్లలో నుంచి నేడు బయటకు రావద్దని అధికారులు తెలిపారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్ప అదీ జాగ్రత్తగా రహదారిపై వెళ్లాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది...
ఇక మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, మొహిదీపట్నం, టోలీ చౌకీ, లక్డీకాపూల్, అమీర్ పేట్, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, ఎస్ఆర్ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్ లలో భారీ వర్షం కురుస్తుంది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలకు నీరు చేరింది. రహదారులపై చేరిన నీటిని జీహెచ్ఎంసీ అధికారులు నీటిని మోటార్లతో బయటకు తోడేస్తున్నారు. మ్యాన్ హోల్స్ మూతలను తెరిచిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ సిబ్బంది నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రం వరకూ ఇదే రకమైన పరిస్థితి ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
సాఫ్ట్ వేర్ సంస్థలకు వర్క్ ఫ్రం హోం నేడు...
సాఫ్ట్ వేర్ సంస్థలు కూడా నేడు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు కంపెనీ యజమానులను కోరారు. ఈరోజు హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశముందని, ఇప్పటికే పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని, అందుకే వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచిస్తున్నారు. బంజారాహిల్స్ లో ఇప్పటికే వాహనాలు రోడ్డుపైన నిలిచిపోయాయి. అలాగే అమీర్ పేట్ లో కూడా వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. హైటెక్ సిటీ ప్రాంతంలోనూ వాహనాల కదలిక స్లోగా ఉందని పోలీసులు తెలిపారు. ఈరోజు అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిచండంతో ప్రజలు బయటకు రావద్దంటూ పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా వార్నింగ్ ఇచ్చారు.