Hyderabad : హైదరాబాద్ ను ముంచెత్తిన వర్షం... సాయంత్రం ఐదు దాటితే చాలు గుండెల్లో దడ
హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం దంచికొట్టింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో హైదరాబాద్ నగరంతో పాటు నగర శివార్లలో పలుచో్ట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది
హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం దంచికొట్టింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో హైదరాబాద్ నగరంతో పాటు నగర శివార్లలో పలుచో్ట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. వేలాది వాహనాలు రోడ్డు మీదనే ఉండిపోయాయి. గంటల తరబడి రోడ్డు మీదనే ఉండిపోవాల్సి వచ్చింది. క్లౌడ్ బరస్ట్ కావడంతో ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. శనివారం రాత్రి పది గంటలకు మొదలయిన వర్షం దాదాపు గంట సేపు కొనసాగింది. ఈ గంట ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నగరవాసులు బితుకు బితుకు మంటూ గడపాల్సి వచ్చింది. మరొకవైపు ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు, పిడుగులు కూడా అనేక చోట్ల పడటంతో వర్షం బీభత్సంగా మారింది.
అనేక ప్రాంతాలు నీట మునిగి...
ఉదయం నుంచి కొంత ఎండ ఉన్నప్పటికీ సాయంత్రానికి కానీ, రాత్రికి గాని భారీ వర్షం వరసగా గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతుంది. భారీ వర్షం పడటంతో రహదారులపై మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచాయి. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచి వాహనదారులు అవస్థలు పడ్డారు. అందులోనూ శ్రావణ పౌర్ణమి కావడంతో పాటు రాఖీ పండగకు వాహనాలతో బయటకు వచ్చిన వారు ఇళ్లకు చేరతామా? లేదా? అన్న అనుమానం కలిగింది. అమీర్ పేట్, యూసఫ్ గూడ్, చర్మాస్ వెనక ప్రాంతంలో ఉన్న కాలనీలు నీట మునిగాయి.నాలాలు ఉప్పొంగి ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. మరొకవైపు మూసీ నదిలోనూ వరద నీటి ప్రవాహం ఎక్కువయింది.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో...
ఇక నగరంలో అనేక చోట్ల మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్ వంటి ప్రాంతాల్లో వాహనాలు గంటల కొద్ది నిలిచిపోయాయి. దీంతో పాటు హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, నాదర్ గుల్, వనస్థలిపురం, ఎల్బీనగర్, నాగోల్,మన్సూరాబాద్, బీఎన్ రెడ్డి నగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో వర్షం జోరుగా పడటంతో రహదారులపై నీరు నిలిచింది. నిన్న అత్యధికంగా రంగారెడ్డి జిల్లా తొర్రూరులో అత్యధికంగా 12.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. సైదాబాద్ లోని రెడ్డి కాలనీ వర్షపు నీటికి నీట మునిగింది. దీంతో సాయంత్రం అయితే నగరవాసులు బయటకు వెళ్లేందుకు భయపడిపోతున్నారు. అందులోనూ పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో వాటికి హాజరై తిరిగి వచ్చే వారు వర్షంలో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు.