Hyderabad : గణేశ్ నిమజ్జనానికి బయలుదేరిన గణనాథులు
ఈరోజు హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే శోభాయాత్ర ప్రారంభమయింది
ఈరోజు హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే శోభాయాత్ర ప్రారంభమయింది. పదకొండు రోజులు పూజలందుకున్న గణనాధులు అందరూ నేడు గంగ ఒడికి చేరుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ మంటపాల నుంచి గణనాధులు ట్యాంక్ బండ్ లో నిమజ్జనం కోసం బయలుదేరాయి. రేపు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉండటంతో చాలా త్వరగా నిమజ్జనం పూర్తి చేయాలని పండితులు సూచించడంతో ఉదయాన్నే నిమజ్జనానికి బయలుదేరే ముందు మంటపాల వద్ద గణనాధులకు పూజలు నిర్వహించారు.
పూజలు నిర్వహించిన అనంతరం....
అనంతరం మంటపం నుంచి క్రేన్ల ద్వారా లారీ మీదకు ఎక్కించిన అనంతరం ట్యాంక్ బండ్ వైపునకు బయలేరుతాయి. హైదరాబాద్ లోని పలు చోట్ల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ తో పాటు సరూర్ నగర్ చెరువుల వద్ద కూడా నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ధర 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. అనంతరం బాలాపూర్ గణేశుడు బయలేరుతాడు. అంతకు ముందు పురవీధుల్లో బాలాపూర్ లో తిరిగి అనంతరం మంటపం వద్దకు చేరుకున్న తర్వాత లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభమవుతుంది.
దాదాపు యాభై వేల గణేశ విగ్రహాలు...
నగరంలో దాదాపు యాభై వేల గణేశ విగ్రహాలు వరకూ నేడు నిమజ్జనం కానున్నాయి. ఇప్పటికే నిన్నటి వరకూ ట్యాంక్ బండ్ వద్ద ఆరు వేల గణనాధులను నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలినవి ఈరోజు పదకొండో రోజు కావడంతో నిమజ్జనానికి బయలుదేరి వెళతారు. దీంతో నగరంలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం నుంచి మొదలయిన గణేశుడి శోభాయాత్ర ట్యాంక్ బండ్ కు చేరుకునే సరికి సాయంత్రం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర మరికాసేపట్లో బయలుదేరనుంది. మధ్యాహ్నానికి ట్యాంక్ బండ్ కు చేరుకునే అవకాశముంది. రాత్రికి గణేశ్ నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.