Hyderabad : కుండపోత వర్షం కురిస్తే ఇక నగరం మునిగిపోవాల్సిందేనా?
హైదరబాద్ లో వర్షం కురిస్తే చాలు .. నగరం మొత్తం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి.
హైదరబాద్ లో వర్షం కురిస్తే చాలు .. నగరం మొత్తం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలోని అనేకప్రాంతాలు నీటమునిగాయి. ఒకటి కాదు.. రెండు కాదు... దాదాపు 70 నుంచి ఎనభై శాతం ప్రాంతాలు నీటిలో నానే పరిస్థితికి వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే నగరంలో కుండపోత వర్షం పడితే మాత్రం నరకం తప్పదని రుజువవుతుంది. ఈ పాపానికి తిలా పాపం.. తలా పిడికెడు అన్నట్లు ప్రజల నుంచి పాలకుల వరకూ బాధ్యత వహించాల్సిందే. భారీ వర్షం కురిసినప్పుడు హైదరాబాద్ రహదారులపై ప్రయాణం అంటేనే ఒకరకమైన భయం అందరిలోనూ ఏర్పడుతుంది. హైదరాబాద్ నగరంలో బతుకు దుర్భరంగా మారుతుంది.
ఆక్రమణలే కారణమా?
దీనికి ప్రధాన కారణం ఆక్రమణలు అని చెప్పక తప్పదు. వ్యాపార, వాణిజ్య, నివాస భవనాలను యధేచ్ఛగా నాలాలపై ఆక్రమించుకోవడంతో పాటు నగరంలో కురిసిన వర్షం ఎటూ వెళ్లడానికి వీలు లేని పరిస్థితులు కల్పించడం కారణంగానే నేడు ఈ దుస్థితి ఏర్పడింది. చెరువులు, నాలాలను ఆక్రమించుకుని ఇళ్లను నిర్మించడం మూలంగా నీరు వెళ్లేందుకు దారి లేక నగరం మీద పడుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు మాత్రమే కాదు.. అనేక ఎగువన ఉన్న ప్రాంతాల్లోకి కూడా వర్షపు నీరు చేరుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఇటువంటి సమస్య ఎప్పుడో వస్తుందని ఊహించారు కానీ.. ఇంత త్వరగానే వస్తుందని ఊహించలేదు. వర్షాకాలంలో హైదరాబాద్ లో ప్రయాణం కత్తిమీద సాముగా మారింది.
రెండు కిలోమీటర్లు.. మూడు గంటలు...
కుండ పోత వర్షం కురిసిన సమయలో రెండు కిలోమీటర్ల ప్రయాణం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. వాహనాలు కొనుగోళ్లు ఎక్కువ కావడంతో పాటు పెరుగుతున్న జనాభాకు తగినట్లు ప్రజా రవాణా వ్యవస్థ ను ఏర్పాటు చేయకపోవడం కూడా సమస్య తీవ్రతకు కారణమని అనేక మంది విశ్లేషిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో రెండు సార్లు క్లౌడ్ బరస్ట్ అయింది. ఆ సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారే తప్పించి శాశ్వత పరిష్కారానికి మాత్రం చొరవ చూపడం లేదు. మేఘాలు కమ్ముకొస్తున్నాయంటే మాత్రం నగర వాసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే.. భవిష్యత్ లో చిన్నపాటి చినుకు పడినా సరే నగరం మొత్తం మునిగిపోవడం ఖాయమన్న కామెంట్స్ వినపడుతున్నాయి.