Hyderabad : హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. కుండపోత వర్షంతో నీట మునిగిన ప్రాంతాలివే
హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్ అయింది. క్యుములోనింబస్ మేఘాల కారణంగానే క్లౌడ్ బరస్ట్ జరిగిందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు
హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్ అయింది. క్యుములోనింబస్ మేఘాల కారణంగానే క్లౌడ్ బరస్ట్ జరిగిందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరబాద్ రోడ్లపైన నాలుగు అడుగుల వరకు నీరు చేరడంతో వాహనాలు మొరాయించాయి. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలైన హయత్ నగర్, ఎల్బీనగర, వనస్థలిపురం, సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, అబ్దుల్లాపూర్ మెట్ లలో భారీ వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు. దాదాపు నాలుగు గంటల నుంచి వర్షం కురుస్తూనే ఉంది.
కుండపోత వర్షంతో ...
కుండపోత వర్షంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. హయత్ నగర్ వద్ద కూడా రహదారిపైకి నీరు రావడంతో అక్కడ వాహనాలు ముందుకు కదలడం లేదు. అయితే హైదరాబాద్ నగరంలోకి వచ్చే వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపో్వడంతో్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి క్లియర్ చేస్తున్నారు. అయితే వాహనాలు మాత్రం ముందుకు రావడానికి ఇబ్బంది పడుతున్నాయి. సాయంత్రం వేళ భారీ వర్షం కురవడంతో ఆఫీసు నుంచి ఇళ్లకు బయలుదేరే ఉద్యోగులతో పాటు విద్యాసంస్థల నుంచి ఇళ్లకు చేరుకునే విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆటోలు కూడా ముందుకు కదలడం లేదు. దీంతో కొందరు విద్యార్థులు స్కూళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విద్యుత్తు సరఫరాకు అంతరాయం...
హైదరాబాద్ లో నిన్న కూడా భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో పాటు విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో ఇళ్లలో ఉన్న ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిలోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వాన నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల వారు తమ ఇళ్లలోకి చేరిన నీటిని బయటకు తోడుకునేందుకు శ్రమిస్తున్నారు. మ్యాన్ హోల్ మూతలు ఎవరూ తీయవద్దని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు స్థానికులను కోరుతున్నారు. తాము వచ్చి అక్కడ వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని మ్యాన్ హోల్ మూతలు తెరుస్తామని చెబుతున్నారు. మొత్తం మీద హైదరాబాద్ మాత్రం జలమయంగా మారింది.