సోమవారం హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి, వేడి నుండి ఉపశమనం లభించింది. అయితే, అకస్మాత్తుగా కురిసిన వర్షం నగరంలో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగించింది, పలు ప్రాంతాల్లో నీరు రోడ్లపై నిలిచిపోయింది. ట్రాఫిక్ రద్దీ ఎదురైంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
తెలంగాణ అభివృద్ధి, ప్రణాళిక సంఘం ప్రకారం, ఆగస్టు 4, 2025న ఉదయం 8.30 నుండి సాయంత్రం 4 గంటల మధ్య బంజారాహిల్స్‌లో అత్యధికంగా 74.5 మిమీ వర్షపాతం నమోదైంది, తరువాత అహ్మద్ నగర్‌లో 53.3 మిమీ, శ్రీనగర్ కాలనీలో 50.8 మిమీ వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు, ముఖ్యంగా సాయంత్రం ఉద్యోగాల నుండి ఇంటికి తిరిగి వచ్చేవారు చాలా ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల కారణంగా జిల్లా కలెక్టర్లు, అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎంఓ నుండి ఒక ప్రకటన కూడా వచ్చింది. ఇలాంటి సమయంలో పౌరులు ఇంటి లోపలే ఉండాలని, అనవసరమైన ప్రయాణాలను నివారించాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)తో సహా అధికారులు, నీటితో నిండిన రోడ్లను శుభ్రం చేయడానికి, ట్రాఫిక్ పరిస్థితిని నిర్వహించడానికి సిబ్బందిని నియమించారు.
ఇంతలో, వరద నీటిలో ఫ్లైఓవర్ పూర్తిగా మునిగిపోయినట్లు చూపించే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారీ. ‘సుమారు అరగంట వర్షంతో, ఫ్లైఓవర్ నిండిపోయింది’ అనే వాదనతో షేర్ చేస్తున్నారు. వీడియోను షేర్ చేసి “హైదరాబాద్‌లోని ఒక ఫ్లైఓవర్ 30 నిమిషాల వర్షం కారణంగా మునిగిపోయింది. వర్షంలో ఫ్లైఓవర్ ఎలా మునిగిపోతుంది? ఇంజనీరింగ్ అద్భుతం” అంటూ పోస్టు పెట్టారు.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఈ వీడియో ఆగస్టు 4, 2025న కురిసిన వర్షానికి సంబంధించినది కాదు, జూలై 18, జూలై 19, 2025న వరుసగా రెండు రోజులు కురిసిన భారీ వర్షాల తర్వాత ఫ్లైఓవర్ మునిగిపోవడాన్ని ఇది చూపిస్తుంది.
వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని, వీడియో మూలాన్ని కనుగొనడానికి రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించాము. ఆ తర్వాత వెతికినప్పుడు, జూలై 19, 2025న ‘కొండాపూర్, హైదరాబాద్’ అనే శీర్షికలతో కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లను కనుగొన్నాము.
ది
టెలిగ్రాఫ్ ప్రచురించిన కథనం కూడా మాకు లభించింది. వర్షపు నీటిలో ఫ్లైఓవర్ మునిగిపోయిన మరొక వీడియోను కూడా మేము కనుగొన్నాము. ది టెలిగ్రాఫ్ ప్రచురించిన ఫేస్‌బుక్ పోస్ట్ ప్రకారం, ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి నిర్మించిన హైదరాబాద్‌లోని కొత్తగూడ-కొండాపూర్ ఫ్లైఓవర్ పరిస్థితి ఇదని అందులో తెలిపారు. కొద్దిసేపు వర్షం తర్వాత, ఎలివేటెడ్ రోడ్డు ఈత కొలనును తలపించింది, వాహనాలు చిక్కుకుపోయాయి. ఎత్తైన నిర్మాణంలో కూడా ఇలా వరదలు ఎలా వస్తాయని పౌరులు ప్రశ్నించారు.
జూలై 18 నుండి జూలై 20, 2025 వరకు 3 రోజుల పాటు
హైదరాబాద్‌లో అధిక వర్షపాతం నమోదైంది, ఆ సమయంలో నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధనంలో ఉండిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఆగస్టు 4, 2025న కూడా నగరంలో భారీ వర్షాలు కురిశాయి. ఆకస్మిక వరదల వలన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలలో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురిసి వరదల లాంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు, 2025 ఆగస్టు 4న హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు సంబంధం లేదు.
ఇది జూలై 18- జూలై 19, 2025 తేదీలలో వరుసగా రెండు రోజులు కురిసిన భారీ వర్షాల సమయంలో తీసిన వీడియో. ఈ వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.