ఫ్యాక్ట్ చెక్: ఐబొమ్మ రవికి సంబంధించిన వీడియో అంటూ ఏఐ ద్వారా సృష్టించిన వీడియోను వైరల్ చేస్తున్నారు

ఐబొమ్మ రవికి సంబంధించిన వీడియో అంటూ ఏఐ ద్వారా సృష్టించిన వీడియో

Update: 2026-01-07 03:54 GMT

iBOMMA అనే పైరసీ సైట్‌ ను సృష్టించి ఎన్నో సినిమాలను ఆన్ లైన్ లో పెట్టిన వ్యక్తి రవి. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉండగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది. బెట్టింగ్ యాప్స్‌తో తనకు సంబంధాలు ఉన్నాయని వాటిని ప్రమోట్ చేశానన్న ఆరోపణల్లో నిజం లేదని కొన్ని మీడియా సంస్థలకు రవి చెప్పాడు. నా పేరు ఐబొమ్మ రవి కాదు ఇమంది రవి. ఐబొమ్మ నాదే అనే దానికి ఆధారాలు ఏవి? నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లు మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించాడు. పోలీసులు చెబితే నేను నేరం చేసినట్లేనా. నేను ఎక్కడికీ పారిపోలేదు. వేరే దేశంలో సిటిజన్ షిప్ మాత్రమే తీసుకున్నానని కూడా అన్నాడు. నేను కూకట్ పల్లి లోనే ఉన్నా.. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటా.. అంటూ ఐబొమ్మ రవి నుండి రెస్పాన్స్ వచ్చింది.


ఇక ఐబొమ్మ రవి రెండు రకాలుగా సినిమా ప్రింట్‌ను కొనుగోలు చేసేవాడని పోలీసులు తెలిపారు. నార్మల్ ప్రింట్‌కు 100 డాలర్లు, హెచ్‌డీ ప్రింట్‌కు 200 డాలర్లు చెల్లించాడని పేర్కొన్నారు. రవికి సంబంధించిన ఏడు ఖాతాలకు రూ.13.40 కోట్లు వచ్చాయని పోలీసులు కస్టడీ రిపోర్టులో తెలిపారు. బెట్టింగ్ యాడ్‌ల ద్వారా రూ.1.78 కోట్లు వచ్చాయని, రవి సోదరి చంద్రికకు రూ.90 లక్షలు పంపాడని అన్నారు. లావాదేవీలన్నీ డాలర్ల రూపంలోనే చేసేవాడని తెలిపారు. రాకేశ్ అనే వ్యక్తి ద్వారా ట్రేడ్ మార్క్ లైసెన్స్ పొందాడని పేర్కొన్నారు. కొంతకాలం కూకట్‌పల్లిలోనే ఆఫీసు నడిపించాడని పోలీసులు చెప్పారు.

ఇంతలో ఐబొమ్మ రవికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అందులో రవి బెడ్ పక్కన ఉన్న అలమారా దగ్గర తచ్చాడుతూ ఉండగా, పోలీసులు బయట తలుపు తట్టడం చూడొచ్చు. పోలీసులు రవి అంటూ పిలవడం ఈ వీడియోలో ఉంది.

వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ చూడొచ్చు

ఆర్కైవ్ లింక్ ఇక్కడ ఉంది.

వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇది



 



ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.

వైరల్ వీడియోను స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ రివర్స్ చేశాం. మాకు ఈ వీడియోను పోస్టు చేసిన మీడియా కథనాలు లభించలేదు. ఇలాంటి వీడియో నిజంగా బయటకు వచ్చినట్లయితే పలు మీడియా సంస్థలు ఖచ్చితంగా వీడియోకు సంబంధించిన కథనాలను పోస్టు చేసి ఉండేవి. మాకు అలాంటి కథనాలు ఏవీ మీడియా సంస్థల నుండి లభించలేదు.

ఇక వైరల్ వీడియో కింద పలువురి కామెంట్లు చూడొచ్చు. ఇది ఫేక్ వీడియో అంటూ చాలా మంది కామెంట్లు చేశారు.

"Bed కనిపించేలా CC tv పెట్టుకుంటారా...? అది కూడా రూమ్ లో....అంత తెలివితక్కువ వాడా...పోలీస్ లు CC tv footage చెక్ చేస్తారు అని ఆ మాత్రం తెలియదా అతనికి...ఇలాంటి ఫేక్ వీడియోలు ఎందుకు పెడుతున్నారు" అంటూ కామెంట్లు చేయడాన్ని మేము గమనించాం.



 



వైరల్ వీడియోను నిశితంగా గమనిస్తే పోలీసులు తలుపు తడుతున్న గదులకు ఉన్న అంకెలు కూడా తేడాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటివి ఏఐ వీడియోలలో సాధారణంగా గమనిస్తూ ఉంటాం.


 వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారా లేదా అని తెలుసుకోవడం కోసం మేము Hive టూల్ ను వినియోగించి సెర్చ్ చేశాం. అయితే ఈ వీడియో ఏఐ సృష్టి అని తేలింది.




 అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.


కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఏఐ ద్వారా సృష్టించిన వీడియోను నిజమైనదిగా వైరల్ చేస్తున్నారు.


Claim :  ఐబొమ్మ రవికి సంబంధించిన వీడియో అంటూ ఏఐ ద్వారా సృష్టించిన వీడియో
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News