నిజమెంత: శబరిమలలోని అయ్యప్ప స్వామి విగ్రహం ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫోటోలు తీసుకోలేదు

శబరిమలలోని అయ్యప్ప స్వామి విగ్రహం ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో

Update: 2025-10-25 14:05 GMT

శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. శబరిమల ఆలయంలో పూజలు చేసిన మొదటి మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు. కేరళ రాష్ట్రంలో 4 రోజుల టూర్‎లో భాగంగా 2025, అక్టోబర్ 22వ తేదీన కేరళ వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. తద్వారా శబరిమలలో పూజలు చేసిన తొలి మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. శబరిమలను దర్శించుకున్న రెండో రాష్ట్రపతిగా ఆమె నిలిచారు. ముర్ము కంటే ముందు1973లో అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి, ఆయన కుమారుడితో పాటు మరికొందరు ఎంపీలతో కలిసి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. తిరిగి 52 ఏళ్ల తర్వాత రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము శబరిమలను దర్శించుకున్నారు.


ఆలయ నియమాలకు తగ్గట్టుగానే రాష్ట్రపతి ముర్ము సంప్రదాయాలను పాటించారు. నల్లటి దుస్తులు ధరించి ఇరుముడి కట్టారు. తలపై ఇరుముడితో 18 బంగారు మెట్లు ఎక్కారు రాష్ట్రపతి. ఆ తర్వాత కొండపై అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. రాష్ట్రపతి వెంట ఉన్న సెక్యూరిటీ, భద్రతా సిబ్బంది సైతం ఇరుముడితోనే బంగారు మెట్లు ఎక్కి స్వామిని దర్శనం చేసుకున్నారు. తిరువనంతపురం నుంచి పతనంతిట్ట వరకు రోడ్డు మార్గంలో వచ్చారు రాష్ట్రపతి. అక్కడి నుంచి కొండ ఆలయం బేస్ స్టేషన్ అయిన పంపాకు చేరుకున్నారు. పంబలో అన్ని పూజలు చేసిన తర్వాత, నాలుగు చక్రాల ప్రత్యేక వాహనాల్లో 4.5 కిలోమీటర్ల స్వామి అయ్యప్పన్ రోడ్డు మీదుగా సన్నిధానం వరకు ప్రయాణించింది.


అయితే రాష్ట్రపతి అధికారిక అకౌంట్ లో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని షేర్ చేశారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

"శబరిమల సంప్రదాయం ప్రకారం, భక్తులు కూడా అయ్యప్ప విగ్రహాన్ని ఫోటో తీయడానికి అనుమతి లేదు. మరి భారత రాష్ట్రపతి ఎలా చేయగలరు? ఈ నమ్మకాలు అధికారంలో ఉన్నవారికి వర్తించవా? లేదా ఆమె హిందూ ఆచారాలకు అతీతులా?" అంటూ పలువురు పోస్టులు పెట్టారు.





వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న రాష్ట్రపతి శబరిమల పర్యటనకు సంబంధించిన ఫోటోలలో గర్భగుడిలోని అయ్యప్ప విగ్రహం లేదు. ఈ చిత్రంలో శబరిమల ఆలయ ప్రాంగణంలో ఉన్న మాలికపురతమ్మ విగ్రహాన్ని చూడొచ్చు.

ఇక వైరల్ పోస్టులకు సంబంధించిన కామెంట్లలో అక్కడ ఉన్నది అయ్యప్ప స్వామి కాదని మాలికపురతమ్మ అంటూ పలువురు కామెంట్లు చేశారు.

ఆ స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు.






 


వైరల్ అవుతున్న ఫోటోలను నిశితంగా పరిశీలించగా, ఆ ఫోటోల్లో ఉన్నది అయ్యప్ప స్వామి విగ్రహం కాదు. అమ్మవారి విగ్రహం అని మా ఫ్యాక్ట్ చెక్ బృందం ధృవీకరించింది.

ద్రౌపది ముర్ము చారిత్రాత్మక పర్యటనకు సంబంధించిన విజువల్స్, కథనాలను మేము పరిశీలించాం. ఎక్కడా కూడా గర్భగుడిలోని అయ్యప్పస్వామి విగ్రహానికి సంబంధించిన విజువల్స్ బహిర్గతం చేయలేదు.

ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్టు చేసిన ఫోటోలను కూడా గమనించవచ్చు. ఇందులో కూడా అయ్యప్పస్వామికి సంబంధించిన చిత్రాలను అప్లోడ్ చేయలేదు.




తెలుగుపోస్టు బృందం శబరిమల ఆలయ బాగోగులు చూసే ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు యంత్రాంగాన్ని కాంటాక్ట్ చేసింది. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని, ఆన్ లైన్ లో తప్పుడు కథనాలను ప్రసారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. వైరల్ పోస్టుల్లో ఉన్నది మాలికపురతమ్మ విగ్రహం అని, ఇది శబరిమల సన్నిధానంలోని మరొక ఆలయంలోని విగ్రహమని వివరించారు.

కాబట్టి, శబరిమల గర్భగుడిలోని అయ్యప్ప స్వామి విగ్రహంతో భారత రాష్ట్రపతి ఫోటోలు తీసుకున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  శబరిమలలోని అయ్యప్ప స్వామి విగ్రహం ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో
Claimed By :  Social media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News