ఫ్యాక్ట్ చెక్: బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న ఘటనను భారత్ లో జరిగిందిగా ప్రచారం చేస్తున్నారు
ఈ వీడియో బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది
భారతదేశంలోని రైల్వేల ద్వారా నిత్యం కోట్ల మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు భారత రైల్వేలను అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. యూనియన్ బడ్జెట్ 2025-26 సమీపిస్తున్న తరుణంలో భారత రైల్వేకి భారీ బడ్జెట్ కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌తో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20% కంటే ఎక్కువ కేటాయింపులు ఉంటాయని భావిస్తూ ఉన్నారు.
అయితే ఓ వ్యక్తి రైల్వే గేట్ ను ఒక్కడే ఆపరేట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. గేట్ ను ఒక్క వ్యక్తే దించి ట్రాఫిక్ ను అడ్డుకోవడమే కాకుండా, పచ్చ జెండా కూడా ఊపడం అందులో చూడొచ్చు. ట్రైన్ వెళ్ళిపోయిన వెంటనే ఆ వ్యక్తి తిరిగి వచ్చి గేట్ ను ఎత్తడం ఆ వీడియోలో రికార్డు అయింది. ఒక్క వ్యక్తే అన్ని పనులూ చేయడం భారత్ లో మాత్రమే సాధ్యమవుతుందనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.
ఈ వీడియో భారతదేశానికి చెందినది కాదు. బంగ్లాదేశ్ కు చెందింది. వైరల్ పోస్టు కింద పలువురు యూజర్లు ఇది భారతదేశంలో కాదు బంగ్లాదేశ్ కు చెందినది చెబుతూ వచ్చారు.
ఇక వైరల్ వీడియోలోని ట్రైన్ మీద ఉన్న లోగోకు ఇండియన్ రైల్వేస్ కు ఎలాంటి సంబంధం లేదు. బంగ్లాదేశ్ రైల్వేస్ లోగోను వికీపీడియా పేజీలో మేము చూశాం. వైరల్ వీడియోలో ట్రైన్ ఇంజన్ ముందు భాగంలో ఉన్న లోగో బంగ్లాదేశ్ రైల్వేస్ లోగో ఒకటేనని గుర్తించాం. కాబట్టి, వైరల్ వీడియోలోని ట్రైన్ బంగ్లాదేశ్ కు చెందినది.
బంగ్లాదేశ్ రైల్వేస్ లోగో
బంగ్లాదేశ్ రైల్వేస్ వికీపీడియా పేజీలో కూడా ఇదే ఫోటోను మీరు చూడొచ్చు. వైరల్ వీడియో లోని ట్రైన్ మీద ఉన్న లోగో, బంగ్లాదేశ్ రైల్వేస్ కు చెందిన లోగో ఒక్కటేనని గుర్తించాం.
వైరల్ వీడియో లోని కీఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా బంగ్లాదేశ్ కు చెందిన ఫ్యాక్ట్ చెక్ పేజీ D-Intent Data లో ఇందుకు సంబంధించిన ట్వీట్ ను మేము గుర్తించాం.
"ఒక వ్యక్తి రైల్వే క్రాసింగ్‌ను మాన్యువల్‌గా నిర్వహిస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. ఈ భారతదేశానికి చెందినదని పేర్కొన్నారు. కానీ ఈ వీడియో బంగ్లాదేశ్‌కి చెందినది." అంటూ వివరణ ఇచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది అంటూ అందులో వివరణ ఇచ్చారు. బంగ్లాదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఒక్కరే లెవెల్ క్రాసింగ్ పనులను చూసుకుంటూ ఉన్నారని పలు వీడియోలను ట్వీట్ లో ఉంచారు.
కాబట్టి, వైరల్ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న ఘటనను భారత్ కు చెందినదిగా ప్రచారం చేస్తున్నారు.