ఫ్యాక్ట్ చెక్: మధుమేహానికి చికిత్స తెలుసుకున్నాడని నటుడు ముకుల్ దేవ్ ను ఫార్మా కంపెనీలు హత్య చేశాయనేది వాస్తవం కాదు
భారతీయుల వంటింటిలో ఉండే ఎన్నో వస్తువులు పలు రోగాలను నివారిస్తాయని బలంగా నమ్ముతారు. జలుబు, పంటి నొప్పులు, జీర్ణ సమస్యలు
Actor Mukul Dev
భారతీయులు వంటింటిలో ఉండే ఎన్నో వస్తువులు పలు రోగాలను నివారిస్తాయని బలంగా నమ్ముతారు. జలుబు, పంటి నొప్పులు, జీర్ణ సమస్యలు మొదలైన సాధారణ సమస్యలకు చికిత్సగా వంటగదిలో లభించే పదార్థాలపై ఆధారపడతారు. ఈ నివారణలు కేవలం శీఘ్ర పరిష్కారాలు మాత్రమే కాదు, పురాతన భారతీయ వైద్య విధానం అయిన ఆయుర్వేదం మద్దతు వల్ల శతాబ్దాలుగా సాంప్రదాయం భాగంగా నిలిచాయి. కొన్ని నివారణ చర్యలు చిన్న వ్యాధులకు తాత్కాలిక ఉపశమనాన్ని అందించగలవు. మరికొన్ని తప్పుదారి పట్టించేవి లేదా హానికరమైనవి కావచ్చు. తీవ్రమైన ఆరోగ్య సమస్యల కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణులతో సంప్రదించడం చాలా ముఖ్యం.
అనేక సోషల్ మీడియా వీడియోలు, పోస్ట్‌లు నిరూపితం కాని కొన్ని చిట్కాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. సరైన వైద్య సంరక్షణ దక్కకుండా ఆలస్యం చేస్తాయి, ముఖ్యంగా డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. కొన్ని ఇళ్లల్లో తయారు చేసే వస్తువులు మధుమేహాన్ని కట్టడి చేయడంలో ఆశాజనకంగా ఉన్నప్పటికీ, సరైన వైద్య మార్గదర్శకత్వం లేకుండా వాటిపై మాత్రమే ఆధారపడటం ప్రమాదకరం, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
తెలుగుపోస్ట్ బృందం ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను చెక్ చేసింది. అందులో దివంగత నటుడు ముకుల్ దేవ్ ని ఫార్మా కంపెనీలు హత్య చేశాయని అందులో ఉన్నాయి. నిమ్మకాయ-అయోడిన్ మిశ్రమం మధుమేహాన్ని శాశ్వతంగా నయం చేయగలదని ఆయన నిరూపించారని పేర్కొన్నారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ దేవి శెట్టి మరణానికి ఒక రోజు ముందు ఈ రెమెడీని ఆయనతో పంచుకున్నారని కూడా ఈ వీడియో పేర్కొంది. డాక్టర్ శెట్టి, అమితాబ్ బచ్చన్, రజత్ శర్మ చిత్రాలు ఉండగా మరింత తెలుసుకోండనే లింక్‌పై క్లిక్ చేయమని వీక్షకులను కోరుతూ కొన్ని అంత్యక్రియల దృశ్యాలను కూడా ఇది చూపిస్తుంది.
విడియో పై ఉన్న క్యాప్షన్ "कोई मिथक नहीं है। यह विज्ञान है। 40 हज़ार से ज़्यादा लोग इस नुस्खे को आज़मा चुके हैं — और 100% लोग डायबिटीज़ से पूरी तरह छुटकारा पा चुके हैं। यह सिर्फ़ एक नुस्खा नहीं है — यह डायबिटीज़ का अंत है। जब तक इसे हटाया नहीं गया — “विवरण देखें” पर क्लिक करें और वीडियो देख लें। అంటూ హిందీలో పోస్టు పెట్టారు. అనువదించగా "ఇది సైన్స్. 40,000 కంటే ఎక్కువ మంది ఈ వంటకాన్ని ప్రయత్నించారు. 100% మంది మధుమేహం నుండి పూర్తిగా విముక్తి పొందారు. ఇది కేవలం ఒక వంటకం కాదు. ఇది మధుమేహం యొక్క ముగింపు." అంటూ అందులో తెలిపారు.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. నటుడు ముకుల్ దేవ్‌ను డ్రగ్ మాఫియా హత్య చేయలేదు. నిమ్మకాయ, అయోడిన్ మధుమేహానికి చికిత్సగా సహాయపడతాయని శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ వైరల్ వీడియోను సంబంధం లేని విభిన్న చిత్రాలను ఉపయోగించి రూపొందించారు.
నటుడు ముకుల్ దేవ్ మరణం అనే కీలక పదాలతో శోధించినప్పుడు, అతను మే 23, 2025న, 54 సంవత్సరాల వయస్సులో మరణించారు. ICUలో 8 రోజులకు పైగా ఉన్నారు. ఎన్నో ఆరోగ్య సమస్యల కారణంగా మరణించాడని మేము కనుగొన్నాము. అతని సోదరుడు రాహుల్ దేవ్ ప్రకారం, అతని మరణం ఆహారపు అలవాట్ల కారణంగా జరిగింది. అతని చివరి రోజుల్లో, అతను తినడం పూర్తిగా మానేశాడు. అతను ఒంటరిగా ఉండాలని భావించాడు. జీవితంపై ఆసక్తిని కోల్పోయాడు. వార్తా నివేదికలు కూడా ఆయన ఒంటరితనంతో బతికారని హైలైట్ చేశాయి, కానీ ఈ మరణంలో ఏ డయాబెటిస్ నివారణ పాత్ర పోషించిందనే ప్రస్తావన లేదు.
డయాబెటిస్ అనేది శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయని లేదా ఉత్పత్తి చేసిన ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించని దీర్ఘకాలిక పరిస్థితి. దీంతో శరీరంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతాయి, ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. నిమ్మకాయలు సిట్రస్ పండ్లు, ఇవి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ప్రధానంగా విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనం చేకూరుస్తాయి. డయాబెటిస్ రోగులకు నిమ్మకాయ ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ ఇది డయాబెటిస్ మూల కారణాన్ని పరిష్కరించదు. దానిని పూర్తిగా నయం చేయదు.
డయాబెటిస్ నివారణకు అయోడిన్ ఉపయోగించరు. అయోడిన్ డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయగలదని ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
వైరల్ వీడియోలో యాంకర్ రజత్ శర్మ అసహజంగా ఏడుస్తున్నట్లు కనిపిస్తోంది. వీడియో స్పష్టంగా ఎడిట్ చేసినట్లు కనిపిస్తోంది. యూనిఫాంలో ఉన్న సైనికులు, శవపేటికపై భారతీయ జెండా తప్పుడు వాదనతో వైరల్ వీడియోకు జోడించారు. సాధారణంగా, అటువంటి గౌరవం అధికారులు, సైనిక సిబ్బందికి ఇస్తారు. నటుడు ముకుల్ దేవ్ అంత్యక్రియలను చూపించే వీడియో ఇక్కడ ఉంది.
పోస్ట్‌కు జత చేసిన లింక్ పనిచేయడం లేదు. పోస్టుల్లో సూచించిన చికిత్స పనిచేస్తుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. నటుడు ముకుల్ దేవ్ మరణం విషయంలో కుట్ర జరిగిందనే వాదనలో కూడా నిజం లేదు.
కనుక, వైరల్ వీడియోను ఎడిట్ చేశారు. నిమ్మకాయ, అయోడిన్ మధుమేహాన్ని పూర్తిగా నయం చేయగలవనే వాదన తప్పు. మధుమేహ నివారణ రహస్యాన్ని కాపాడటానికి ఫార్మా కంపెనీలు నటుడు ముకుల్ దేవ్‌ను హత్య చేశాయనే వాదన నిజం కాదు.
Claim : మధుమేహానికి చికిత్స తెలుసుకున్నాడని నటుడు ముకుల్ దేవ్ ను ఫార్మా కంపెనీలు హత్య చేశాయి
Claimed By : Facebook User
Fact Check : Unknown