‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్ అంటే ఏమిటి? దాని నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి

"డిజిటల్ అరెస్ట్" స్కామ్ ద్వారా సైబర్ క్రిమినల్స్ ఎంతో మంది ప్రజలను మోసం చేస్తున్నారు. సామాన్యులే కాదు చదువుకున్న

Update: 2025-09-22 08:51 GMT

digital arrest scam 

"డిజిటల్ అరెస్ట్" స్కామ్ ద్వారా సైబర్ క్రిమినల్స్ ఎంతో మంది ప్రజలను మోసం చేస్తున్నారు. సామాన్యులే కాదు చదువుకున్న వాళ్లు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులూ వీటి బారిన పడుతున్నారు. స్కామర్లు తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులు, వారు ఆన్లైన్ లో చేసిన తప్పులకు "డిజిటల్ అరెస్టు" అయ్యారని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. అసలు విషయం ఏమిటంటే భారతీయ చట్టంలో "డిజిటల్ అరెస్ట్" అనేదే లేదు. ఏ పోలీసు అధికారి లేదా ప్రభుత్వ సంస్థ వీడియో కాల్ లేదా ఇంటర్నెట్ ద్వారా ఎవరినీ అరెస్టు చేయలేరు. 

ఈ స్కామ్ ఎలా చేస్తారు?

స్కామ్ సాధారణంగా మీకు తెలియని నంబర్ నుండి వచ్చే కాల్ తో మొదలవుతుంది. అవతలి వైపు CBI, TRAI, ED లేదా IPS అధికారిగా నటిస్తారు. కొన్నిసార్లు వారు ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులుగా నటిస్తారు. ఈ పేర్లు శక్తివంతమైనవి, ముఖ్యమైనవిగా అనిపించడం వల్ల, చాలా మంది భయపడి వాటి వల్ల భయపడతారు. వారి మాటలు నమ్మితే, మనీలాండరింగ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా ఆర్థిక మోసం వంటి నేరాలతో మీకు సంబంధం ఉందని ఆరోపిస్తారు. మిమ్మల్ని భయపెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. సహజంగానే, చాలా మంది అలాంటి విషయాలు విన్నప్పుడు భయపడతారు.
ఆ తర్వాత బాధితుల పై స్కామర్లు ఒత్తిడి పెంచుతారు. "డిజిటల్ అరెస్టు" అయ్యారని, తక్షణ చర్యలు మాత్రమే మిమ్మల్ని రక్షించగలదని వారు హెచ్చరిస్తారు. బాధితులు RTGS లేదా NEFT ద్వారా పెద్ద మొత్తాలను బదిలీ చేయమని కోరుతారు. ఈ మొత్తాలు కొన్ని సందర్భాల్లో లక్షలు లేదా కోట్లలో ఉంటాయి. మోసం అరుదుగా మాత్రమే ఒక బదిలీతో ముగుస్తుంది. స్కామర్లు సాధారణంగా ఎక్కువ డిమాండ్ చేస్తారు, మీరు సహకరిస్తూ ఉంటేనే తదుపరి చట్టపరమైన చర్యలను అడ్డుకోగలమని నమ్మిస్తూ ఉంటారు. అలా డబ్బును లాగేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో, బాధితులు తమ ATM, ఖాతా నంబర్‌లను కూడా ఇచ్చేస్తూ ఉంటారు. దీనివల్ల మోసగాళ్లకు బాధితుల లావాదేవీలు, ఇతర వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. 
సైబరాబాద్ పోలీసు అధికారుల ప్రకారం, 'డిజిటల్ అరెస్ట్' చట్టం అనేదే లేదు. 'డిజిటల్ అరెస్ట్' స్కామ్ నుండి బాధితులను రక్షించే ప్రయత్నంలో, అధికారులు ఒక కీలక ప్రకటన చేశారు. "డిజిటల్ అరెస్ట్" అన్నది భారతీయ చట్టం ప్రకారం లేదని, అంటే ఏ పోలీసు అధికారి లేదా ప్రభుత్వ అధికారి వీడియో కాల్ ద్వారా చట్టబద్ధంగా అరెస్టు చేయలేరని స్పష్టం చేశారు. ప్రజలు అటువంటి కాల్‌లు స్వీకరించినప్పుడు మిమ్మల్ని మోసం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నట్లుగా గుర్తించాలి. ముఖ్యంగా కాలర్ డిజిటల్ అరెస్టుకు బెదిరించి డబ్బు డిమాండ్ చేసినప్పుడు వారిని నమ్మకూడదు. ఈ స్కామ్ కాల్స్ అందుకునే వ్యక్తులు ప్రశాంతంగా ఉండి, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయడం ద్వారా వెంటనే నివేదించాలని సూచించారు.
Full View
ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ ద్వారా ఎంతో మంది మోసపోయారు. చాలా మంది ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్నారు. పలువురు ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఈ మోసపోయిన వారి జాబితాలో ఉన్నారు. ముఖ్యంగా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను మోసం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు 83 ఏళ్ల వ్యక్తి TRAI కు సంబంధించిన వ్యక్తి అని నమ్మి కేవలం పది రోజుల్లోనే ₹80 లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. 65 ఏళ్ల మరో వ్యక్తి CBI, ED, క్రైమ్ బ్రాంచ్ నుండి వచ్చినట్లు నటించిన వ్యక్తుల మాయలో పడిపోయాడు. అతను దాదాపుగా 1.38 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. కేటుగాళ్లు ఇంకా ఎక్కువనే డిమాండ్ చేశారు. వాట్సాప్ కాల్స్ ద్వారా పదే పదే బెదిరింపుల తర్వాత 45 ఏళ్ల వ్యక్తి ₹6.6 లక్షలు బదిలీ చేయవలసి వచ్చింది. మరొక సందర్భంలో, 75 ఏళ్ల వ్యక్తి మనీలాండరింగ్‌తో సంబంధం ఉందని నకిలీ IPS అధికారి చెప్పడంతో 21 లక్షలు పోగొట్టుకున్నాడు.

మనల్ని మనం కాపాడుకోవడం ఎలా?

అటువంటి స్కామ్‌లను నివారించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దు. ఏ ప్రభుత్వ అధికారి కూడా ఎవరూ కాల్‌లో మిమ్మల్ని అరెస్టు చేస్తామని లేదా ఆన్‌లైన్‌లో డబ్బు పంపించాలని బెదిరించరు. బ్యాంక్ వివరాలు, OTPలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో ఎప్పుడూ పంచుకోరు. మీకు అలాంటి కాల్ వస్తే, వెంటనే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి. అలాంటి పరిస్థితుల్లోనూ డబ్బు పంపవద్దు. మిమ్మల్ని ఎవరైనా లక్ష్యంగా చేసుకున్నారని మీరు అనిపిస్తే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. 1930 నెంబర్ కు డయల్ చేయడం ద్వారా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఆశ్రయించండి. లేదా www.cybercrime.gov.in లో లాగిన్ అవ్వండి.
ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. ప్రశాంతంగా ఉండాలి, సరైన సమాచారం ఎప్పటికప్పుడు మీ దగ్గర ఉండడంతో ఈ డిజిటల్ మోసగాళ్లకు వ్యతిరేకంగా తమను తాము రక్షించుకోవచ్చు. 
Tags:    

Similar News