రెండు గంటల్లో లోన్ పేరుతో రూ. 45 లక్షలు దోపిడి..! హైదరాబాద్ లో టెక్కీకి ఎదురైన చేదు అనుభవం.
హైదరాబాద్‌కి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి (57). తన వాట్సప్ కి లో ఇంట్రెస్ట్‌కి రూ.15లక్షల వరకు లోన్ వస్తుందంటూ.. ఆఫర్‌తో కూడిన మెసేజ్ రావడంతో, అది నిజమని నమ్మి మెసేజ్‌లో ఉన్న నంబర్ కి కాంటాక్ట్ అయ్యాడు.
తక్కువ వడ్డీకి రుణాలు.. అస్సలు నమ్మొద్దు!!
హైదరాబాద్‌కి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి (57). తన వాట్సప్ కి తక్కువ వడ్డీకి రూ.15లక్షల వరకు లోన్ వస్తుందంటూ.. ఆఫర్‌తో కూడిన మెసేజ్ రావడంతో, అది నిజమని నమ్మి మెసేజ్‌లో ఉన్న నంబర్ కి కాంటాక్ట్ అయ్యాడు. అవతలి వ్యక్తి అడిగిన తన పర్సనల్ డీటేయిల్స్ (ఆధార్, పాన్, బ్యాంకు అకౌంట్ వివరాలు) అన్నిటినీ వాట్సప్ ద్వారా షేర్ చేశాడు. తర్వాత ఎందుకనో ఇది సైబర్ నేరగాళ్ల ట్రాప్ ఏమోనని డౌట్ వచ్చి వెంటనే వాటిని డిలీట్ చేశాడు. ఆ తర్వాత ఓ వ్యక్తి ఫోన్ చేసి వివరాలు ఎందుకు డిలీట్ చేశారని, లోన్ ప్రాసెసింగ్ చేస్తున్నాం, భయపడాల్సినవసరం లేదని బదులు చెప్పాడు. అంతేకాక మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది. సో దాన్ని బెటర్ చేసేందుకు కొంత నగదు పే చేస్తే సిబిల్ పెంచుతామని, యూపీఐ స్కానర్‌ను పంపాడు. అయితే బ్యాంకు ఖాతాలో తక్కువ నగదు ఉండటం, ఖాతా వివరాలు డిలీట్ చేయడం కారణాలుగా చూపి, పెనాల్టీ పడిందని కొన్ని దఫాలుగా డబ్బులు వసూలు చేశారు. ప్రాసెసింగ్ ఫీ, రీఫండబుల్ ఎమౌంట్ అంటూ మరికొంత వసూలు చేశారు. మరీ ఇన్నిసార్లు ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారయ్యా అంటే, మీరు కట్టిన డబ్బు లోన్‌తో కలిపి వస్తుందని నమ్మించారు. నమ్మితేనే కదా మోసం చేసేది అన్నట్లు.. సైబర్ నేరగాళ్లు విడతల వారీగా సుమారుగా రూ.44.83 లక్షలు వసూలు చేశారు. తనకి లోన్ వస్తుందని నమ్మిన బాధితుడు అప్పుచేసి మరీ డబ్బును నేరగాళ్లు సూచించిన ఖాతాలకు పంపాడు. పై అథారిటీ నుంచి లోన్ అప్రూవ్ అయిందని, మరికొంత ఫీజు చెల్లించాలని డిమాండ్ చేయడంతో, ఇక నా వద్ద డబ్బుల్లేవు. ఇప్పటివరకు చెల్లించిన నా డబ్బు నాకు తిరిగివ్వండని బాధితుడు వేడుకున్నాడు. దాంతో సైబర్ నేరగాళ్లు మీపై కేసు నమోదు చేస్తామని బెదిరించడంతో పాటు, అసభ్య సందేశాలు పంపించి వేధింపులకు గురిచేశారు. ఇదంతా అయ్యాక తాను మోసపోయానని తత్వం గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.
సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండేందుకు పాటించాల్సినవి:
బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని, ప్రభుత్వ కార్యాలయానికి చెందినవారమని మీకు కాల్ చేసి చెప్పినా లేదంటే బెదిరించినా.. మీ పర్సనల్ వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని గుర్తుంచుకోండి. ఒకవేళ ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు స్క్రీన్ పైన కనిపించే అవతలి వారి పేరు, నంబర్ ను తప్పనిసరిగా వెరిఫై చేయాలి. తొందరపడి పొరపాటున తప్పు నంబర్ కి పేమెంట్ జరగకుండా ముందే జాగ్రత్త పడొచ్చు.
మీకు తెలియనివారి నుంచి వచ్చిన లింక్స్, మెసేజ్ ల ద్వారా యాప్ లను అసలు డౌన్లోడ్ చేసుకోవడం గానీ లేదంటే లింకులపై క్లిక్ చేయడం గానీ చేయొద్దు.
మీ యూపీఐ పిన్, ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) లేదా బ్యాంక్ వివరాలను పూర్తిగా పర్సనల్ అండ్ సీక్రెట్ గా ఉంచుకోవాలి. వాటిని ఎవరికీ చెప్పకూడదు.
పైన తెలిపిన టిప్స్ ను పాటించడం వల్ల సైబర్ నేరాలను కొంతవరకైనా అరికట్టవచ్చు. ఏదైనా అనుమానస్పద యాక్షన్ కనిపించగానే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 లేదా 8712665171 నంబర్‌కి కాల్ లేదా వాట్సప్ చేయండి. లేదంటే cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.