crypto trading scam: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ₹43.6 లక్షల క్రిప్టో మోసం

కాపు మ్యాట్రిమోనీలో పరిచయం… వాట్సాప్‌లో నమ్మించి పెట్టుబడి తీసుకున్న మోసగాళ్లు ‘bitcoin-aa.com’ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ ద్వారా డబ్బులు దోచిన గ్యాంగ్‌ పై ఫిర్యాదు

Update: 2025-10-28 13:42 GMT

హైదరాబాద్‌:క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పేరుతో నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నుంచి ₹43.6 లక్షలు మోసగాళ్లు కాజేశారు. కాపు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ ద్వారా పరిచయం అయిన మహిళ ఈ మోసంలో కీలక పాత్ర పోషించిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కూకట్‌పల్లికి చెందిన అంబటి ఎం.వి. శివకుమార్‌ (32) ఆగస్టు 12, 2025న కాపు మ్యాట్రిమోనీలో రోష్నీ (ID: KAP633856) అనే మహిళతో పరిచయం అయ్యింది. కొద్ది రోజులకు ఆమె యూకే నంబర్‌ (+44 7586 224153) ద్వారా వాట్సాప్‌లో చాటింగ్‌ చేస్తూ క్రిప్టో ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మించింది.

నకిలీ వెబ్‌సైట్‌ ద్వారా లావాదేవీలు

ఆమె చెప్పినట్టే శివకుమార్‌ మొదట 500 USDT (సుమారు ₹50వేలు)ను ‘www.bitcoin-aa.com’ అనే వెబ్‌సైట్‌ ద్వారా పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత ఆగస్టు 30, సెప్టెంబర్‌ 9, 11 తేదీల్లో ఐఎంపీఎస్‌ ద్వారా వరుసగా ₹50వేలు, ₹1లక్ష, ₹2.30లక్షలు, ₹4.30లక్షలు బదిలీ చేశాడు. ఆన్‌లైన్‌ సపోర్ట్‌ ద్వారా ₹98వేలు వెనక్కి పొందడంతో నమ్మకం కుదిరి మొత్తం ₹43.60లక్షలు వివిధ ఖాతాలకు పంపించాడు.

ఖాతా ఫ్రీజ్‌, మరింత డబ్బు అడిగారు

తర్వాత రోష్నీ మరో వ్యక్తి ద్వారా అతని ఖాతాలో 12,000 USDT జమ చేయించిందని, ఆ వెంటనే ఖాతా ఫ్రీజ్‌ అయ్యి ₹12లక్షలు చెల్లిస్తేనే  మళ్లీ యాక్టివ్‌ చేస్తామని మోసగాళ్లు చెప్పారు. విషయాన్నీ గ్రహించిన శివకుమార్‌ వారితో సంబంధాలు తెంచుకున్నాడు. అనంతరం వారు అతని ఖాతాలో ₹2.83కోట్లు ఉన్నాయని, మరిన్ని చెల్లింపులు చేస్తేనే విడుదల చేస్తామని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నాడు.

బిట్‌కాయిన్‌ కస్టమర్‌ సపోర్ట్‌ (+1 423 314 4388) పేరుతో ఉన్న నంబర్‌, వెబ్‌సైట్‌ నిర్వాహకులు, డబ్బులు బదిలీ అయిన బ్యాంకు ఖాతాదారులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.




Tags:    

Similar News