Cyber Crime : హైదరాబాద్ నగరంలో సైబర్ మోసం.. కూరగాయలు కొనేందుకు?

హైదరాబాద్ నగరాన్ని సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. వాళ్లు వీళ్లు అనేది లేదు.. ఎవరి నుంచైనా దోచుకునేందుకు వివిధ రకాల వ్యూహాలతో ముందుకు వస్తున్నారు

Update: 2025-10-07 07:41 GMT

హైదరాబాద్ నగరాన్ని సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. వాళ్లు వీళ్లు అనేది లేదు.. ఎవరి నుంచైనా దోచుకునేందుకు వివిధ రకాల వ్యూహాలతో ముందుకు వస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ పై ప్రచారం జోరుగా జరుగుతుండటంతో దానిని పక్కన పెట్టి ప్రత్యామ్నాయం వైపు సైబర్ నేరగాళ్లు దృష్టి పెట్టినట్లు కనపడుతుంది. తాజాగా హైదరాబాద్ లో యూసుఫ్‌గూడకు చెందిన ఒక యువకుడు ఆన్‌లైన్‌లో కూరగాయలు ఆర్డర్‌ చేస్తూ మోసానికి గురయ్యాడు. సెప్టెంబర్‌ 30వ తేదీన తక్కువ ధరలు చూపిన తెలియని వెబ్‌సైట్‌ ద్వారా ఆర్డర్‌ చేశాడు. కొద్దిసేపటికే ఆన్‌లైన్‌ గ్రోసరీ, ఫుడ్‌ డెలివరీ యాప్‌ కస్టమర్‌కేర్‌ నుంచి వచ్చినట్లు చెప్పుకున్న వ్యక్తి ఫోన్‌ చేసి పెండింగ్‌ చెల్లింపు చేయాలని కోరాడు. అతను వాట్సాప్‌ ద్వారా ఏపీకే ఫైల్‌ పంపాడు. బాధితుడు దాన్ని ఇన్‌స్టాల్‌ చేసి 360 రూపాయలు చెల్లించాడు.

క్రెడిట్ కార్డు ద్వారా...
తర్వాతే అతనికి క్రెడిట్‌కార్డ్‌ నుంచి పెద్ద మొత్తంలో డెబిట్‌ జరిగినట్లు సందేశం వచ్చింది. ఓటీపీ ఇవ్వకపోయినా డబ్బు కట్‌ అయ్యింది. ఆపై తన మొబైల్‌లో కాల్‌ ఫార్వార్డింగ్‌ యాక్టివేట్‌ అయినట్లు గమనించాడు. మొత్తం రూ.1.97 లక్షలు పోయాయి. దీంతో వెంటనే అప్రమత్తమయిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇలా మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ ధరకు కూరగాయలు వస్తున్నాయని చెప్పి ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చి రెండు లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో ఆ యువకుడు లబోదిబోమంటున్నాడు. ఖర్చు తగ్గుతుందని కక్కుర్తి పడితే మొదటకే మోసం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
తెలియని వెబ్ సైట్ ల ద్వారా...
తెలియని వెబ్‌సైట్‌లు, లింకుల ద్వారా వస్తువులు కొనొద్దని సైబరాబాద్‌ పోలీసులు హెచ్చరించారు. ఆన్‌లైన్‌ యాప్‌లు లేదా కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ను మాత్రమే వినియోగించాలని కోరారు. వాట్సాప్‌ ద్వారా వచ్చిన ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్‌ చేయవద్దని, అవి మాల్‌వేర్‌, స్పైవేర్‌ ఉండే అవకాశముందని తెలిపారు. ఓటీపీలు, బ్యాంక్‌ వివరాలు ఇవ్వకూడదని, రిమోట్‌ యాక్సెస్‌ అనుమతించవద్దని సూచించారు. బ్యాంక్‌, క్రెడిట్‌కార్డ్‌ లావాదేవీలను తరచుగా చెక్‌ చేయాలని, అనుమానాస్పద సందేశాలు, కాల్స్‌, వెబ్‌సైట్లను వెంటనే బ్యాంక్‌ లేదా సైబర్‌క్రైమ్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 1930 హెల్ప్‌లైన్‌ లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయవచ్చని, అత్యవసర సమయంలో 8712665171 నంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News