job offer scam: ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఉద్యోగ ప్రకటనతో రూ.4.5లక్షల మోసపోయిన ఓ కార్మికుడు

టెలిగ్రామ్‌, నకిలీ ఈమెయిల్స్‌తో మభ్యపరిచిన మోసగాళ్లు

Update: 2025-10-29 13:03 GMT

శంషాబాద్ కు చెందిన ఓ గోదాం కార్మికుడు విదేశీ ఉద్యోగం పేరిట రూ.4.51లక్షలు కోల్పోయాడు. ఈ ఘటనపై బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రసీద్‌గూడ (గొల్లపల్లి కళాన్‌)కు చెందిన అబ్దుల్‌ తాహ్‌ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘WorkYourWay’ పేరుతో వచ్చిన ఉద్యోగ ప్రకటనను క్లిక్‌ చేశాడు. ఆ లింక్‌ ద్వారా టెలిగ్రామ్‌ ఛానల్‌లోకి వెళ్లగా, ‘నితేశ్‌ కుమార్‌’ అనే వ్యక్తి  ఆ కంపెనీ ప్రతినిధినని పరిచయం చేసుకున్నాడు.

తరువాత అతను అబ్దుల్‌ వ్యక్తిగత వివరాలు తీసుకుని ‘Lakeland Company Work’ అనే సంస్థ పేరుతో నకిలీ ఉద్యోగ పత్రాలు పంపాడు. అనంతరం ‘వీసా నిపుణుడు’గా పరిచయం చేసుకున్న ఆంటోనీ లేన్‌ (@antony_lane) టెలిగ్రామ్‌లో సంప్రదింపులు కొనసాగించాడు.

info@vfsglobal-services.co.uk అనే నకిలీ ఈమెయిల్‌ ఐడీ నుంచి వచ్చిన మెయిల్స్‌లో VFS Global లోగో ఉపయోగించి మోసగాళ్లు నమ్మించారు. ఆ సూచనల మేరకు అబ్దుల్‌ వేర్వేరు ఖాతాల్లో రూ.4,51,571 చెల్లించాడు.

వీఎఫ్‌ఎస్‌లోనే బట్టబయలు

అనంతరం అక్టోబర్‌ 21, 2025 తేదీతో నకిలీ బయోమెట్రిక్‌ అపాయింట్‌మెంట్‌ లేఖ పంపడంతో అబ్దుల్‌ వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ అధికారులు పత్రాలు నకిలీవని తేల్చారు.

దీంతో మోసపోయినట్లు తెలిసి రీఫండ్‌ అడగా, మోసగాళ్లు రూ.37వేలు అదనంగా చెల్లిస్తే డబ్బు తిరిగి వస్తుందన్నారు. వీఎఫ్‌ఎస్‌ అధికారులు తాను మరింత చెల్లించవద్దని, పోలీసులను సంప్రదించాలన్నారు.

అబ్దుల్‌ తన ఫిర్యాదుతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌ లింకులు, చాట్‌ వివరాలు, డబ్బు పంపిన రసీదులు, బ్యాంకు వివరాలు అన్ని సమర్పించాడు.

దేశవ్యాప్తంగా మోసం నడుస్తోందని ఫిర్యాదు

ఈ మోసం దేశవ్యాప్తంగా విస్తరించి ఉందని, పేరున్న కంపెనీల పేర్లను వాడుతూ నకిలీ నియామక ప్రకటనలు చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని అబ్దుల్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Tags:    

Similar News