ఇన్వెస్ట్మెంట్ పేరు తో డాక్టర్ కి రూ.41లక్షలు టోపీ..

కల్పనా శ్రీంగార్‌, ఆమె భర్త డాక్టర్‌ ఉదయ్‌ శంకర్‌ ఆరగాకు ఫేస్‌బుక్‌ ద్వారా హర్షిణి చౌదరి అనే మహిళ పరిచయమై జీబీసీ ద్వారా బంగారం ట్రేడింగ్‌ చేస్తే అధిక లాభాలు

Update: 2025-09-23 13:15 GMT

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌కు చెందిన 64 ఏళ్ల డాక్టర్‌ కల్పనా శ్రీంగార్‌కి ఆన్‌లైన్‌ పెట్టుబడి మోసం బారినపడి రూ.41.06 లక్షలు నష్టం వాటిల్లింది. ఈ విషయమై ఆమె సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు వివరాల ప్రకారం.. కల్పనా శ్రీంగార్‌, ఆమె భర్త డాక్టర్‌ ఉదయ్‌ శంకర్‌ ఆరగాకు ఫేస్‌బుక్‌ ద్వారా హర్షిణి చౌదరి అనే మహిళ పరిచయమైంది. తాను బెంగళూరులో ఇంటీరియర్‌ డిజైనర్‌, ఓ డిజైన్‌ కంపెనీ బోర్డు సభ్యురాలిని, తాను అసలు తిరుపతివారినని చెప్పింది.

తరువాత ఆమె వివిధ నంబర్ల ద్వారా వాట్సాప్‌లో సంప్రదించి గోల్డ్‌ బ్లాక్‌చైన్‌ఎక్స్‌ (జీబీసీ) అనే డిజిటల్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం పరిచయం చేసింది. జీబీసీ ద్వారా బంగారం ట్రేడింగ్‌ చేస్తే అధిక లాభాలు వస్తాయని చెప్పి gbcxvault.com, gbcx-secure.net అనే వెబ్‌సైట్లలో రిజిస్ట్రేషన్‌ చేయించింది.

బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీలు

మొదట లాభాల పేరుతో చిన్న మొత్తాలు వారి ఖాతాలకు జమ కావడంతో నమ్మకం పెరిగింది. దాంతో ఆమె సూచనల మేరకు ఇండియన్‌ ఓవర్సీస్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాల నుంచి నిధులు పంపించారు. ఆ మొత్తాలు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సిటీ యూనియన్‌ బ్యాంకు ఖాతాలకు వెళ్లాయి.

డాక్టర్‌ కల్పనా ఖాతా నుంచి మొత్తం రూ.39.90 లక్షలు, భర్త ఉదయ్‌ శంకర్‌ ఖాతా నుంచి రూ.1.50 లక్షలు బదిలీ చేశారు. అందులో కేవలం రూ.33,979 మాత్రమే తిరిగి వచ్చాయి. ఆ తరువాత support@gbcxvault.comనుంచి టాక్స్‌ నోటీసుల పేరుతో మరింత డబ్బు డిపాజిట్‌ చేయాలని కోరారు.

విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా ఆ వెబ్‌సైట్‌ ఆర్జీటీఎస్‌ ద్వారా అదనంగా డబ్బు పెట్టాలని డిమాండ్‌ చేసింది. వెంటనే అన్ని సంప్రదింపులు నిలిచిపోయాయి. మోసపోయినట్టు గ్రహించిన దంపతులు పోలీసులను ఆశ్రయించారు.

Tags:    

Similar News