Fake Trading App scam: హైదరాబాద్ వ్యాపారవేత్తకు రూ.2 కోట్లు నష్టం

ఫేస్‌బుక్ ప్రకటనతో మొదలైన మోసం వాట్సాప్ గ్రూప్ పేరుతో నకిలీ పెట్టుబడుల ఎర

Update: 2026-01-02 16:43 GMT

హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్‌పేటకు చెందిన 37 ఏళ్ల వ్యాపారవేత్త ఓఫేక్ స్టాక్ ట్రేడింగ్ యాప్ వాళ్ళ మోసపోయాడు. ఈ మోసంలో అతడు మొత్తం రూ.2,00,13,066 కోల్పోయినట్లు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితుడు సిద్ధెంకి రాకేశ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, 2025 నవంబర్‌లో ఫేస్‌బుక్‌లో కనిపించిన పెట్టుబడి ప్రకటన అతడిని ఆకర్షించింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు వస్తాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

వాట్సాప్ గ్రూప్, నకిలీ లాభాల ప్రదర్శన


ఫిర్యాదు ప్రకారం, ‘నోమురా ఎఫ్‌జిక్యూ ఐ-189’ పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. నోమురా సెక్యూరిటీస్ పేరుతో నడిచిన ఈ గ్రూప్‌లో సభ్యులు స్టాక్ సూచనలు, లాభాల స్క్రీన్‌షాట్లు షేర్ చేశారు. 2025 నవంబర్ 19 ప్రాంతంలో రాకేశ్ రెడ్డి గ్రూప్‌లో చేరారు. వెబ్ లింక్ ద్వారా పనిచేసే మొబైల్ యాప్‌లో ట్రేడింగ్ చేయాలని సూచించారు.

అతడిని హై నెట్ వర్త్ (హెచ్‌ఎన్‌డబ్ల్యూ) ఖాతాదారుడిగా నమోదు చేశారు. ‘వెరిఫికేషన్’ పేరుతో ఆధార్ వివరాలు తీసుకున్నారు. కావ్యా రెడ్డి అనే వ్యక్తి ప్రధాన ఆపరేటర్‌గా ట్రేడింగ్ సూచనలు ఇచ్చినట్లు రాకేశ్ రెడ్డి తెలిపారు.

మొదట రూ.40 వేల పెట్టుబడి పెట్టగా యాప్‌లో లాభాలు చూపించారు. రూ.27,880ను బ్యాంక్ ఖాతాకు జమ చేయడంతో నమ్మకం పెరిగింది.

ఐపీవోలు, పెరిగిన చెల్లింపుల ఒత్తిడి

తరువాత ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడ్లు, ఓటీసీ ట్రేడ్లు, ఐపీవోలలో పెట్టుబడులు పెట్టించారు. క్యూఐబీ కోటాలో నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్, కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఐపీవోల్లో భారీగా పెట్టుబడి పెట్టాలని ఒప్పించారు.

షేర్లు అమ్మినట్లు చూపుతూ యాప్‌లో లాభాలు కోట్లలో ఉన్నట్లు ప్రదర్శించారు. మొత్తం లాభం రూ.9.28 కోట్ల వరకు చూపించారు. డబ్బు తీసుకునే ప్రయత్నం చేయగానే రూ.80,67,213 కమిషన్ చెల్లించాలని చెప్పారు. ఆ మొత్తం చెల్లించినప్పటికీ ట్రాన్సాక్షన్ నిలిచిపోయింది.

మళ్లీ అదే కమిషన్ కోరారు. లాభాల నుంచి సర్దుబాటు చేయాలని రాకేశ్ రెడ్డి అడిగితే, ప్రైవేట్ హెచ్‌ఎన్‌డబ్ల్యూ ఖాతాలపై తమకు నియంత్రణ లేదని చెప్పి మరిన్ని చెల్లింపులు కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

సైబర్ క్రైం ఫిర్యాదు నమోదు

మోసమని గ్రహించిన రాకేశ్ రెడ్డి డిసెంబర్ 31, 2025న 1930 జాతీయ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఆయనకు అంగీకార సంఖ్య 33712250062573 ఇచ్చారు. మొత్తం నష్టం రూ.2,00,13,066గా సైబర్ క్రైం పోలీసులు నిర్ధారించారు. ఫేక్ ట్రేడింగ్ యాప్, వాట్సాప్ గ్రూప్ నిర్వాహకులు, బ్యాంక్ లావాదేవీలపై దర్యాప్తు మొదలైంది.

Tags:    

Similar News