నకిలీ ‘UBSIN’ ట్రేడింగ్ యాప్‌తో హైదరాబాద్ వ్యాపారికి ₹53.99 లక్షల మోసం
ఫేస్‌బుక్ ప్రకటనతో లాభాల ఆశ చూపి ఉచ్చులో పడేసిన మోసగాళ్లు ‘ప్రొఫెసర్ ఆదితి శర్మ’, ‘మ్యారీ’ పేర్లతో నమ్మించిన నిందితులు
హైదరాబాద్: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో నకిలీ యాప్ సృష్టించి ఒక వ్యాపారిని రూ.53.9లక్షలు మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. “UBSIN” అనే పేరుతో నడిచిన ఈ నకిలీ ప్లాట్‌ఫామ్‌పై సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
టెలికాం నగర్ ఎక్స్‌టెన్షన్, గచ్చిబౌలిలో నివసిస్తున్న 48 ఏళ్ల డి. సోమశేఖర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, అక్టోబర్ 21న ఫేస్‌బుక్‌లో కనిపించిన ప్రకటన ద్వారా www.ubsin.netవెబ్‌సైట్‌కి వెళ్లానని తెలిపారు. ఆ ప్రకటనలో ‘ప్రొఫెసర్ ఆదితి శర్మ’ మార్గదర్శకత్వంలో ట్రేడింగ్ నేర్చుకుని లాభాలు పొందవచ్చని పేర్కొన్నట్లు తెలిపారు.
తరువాత ‘UBS ఇన్‌స్టిట్యూషనల్ అకౌంట్స్ గ్రూప్ అనలిస్టు’గా పరిచయం చేసుకున్న ‘మ్యారీ’ అనే మహిళ (ఫోన్ 7997029364) తనను సంప్రదించిందని, ఆమె సూచనల మేరకు ‘UBSIN’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఖాతా (UID 2368) తెరిచారని తెలిపారు.
ప్రారంభంలో ఆమె చెప్పినట్లు రూ.50 వేల్ని ఐసీఐసీఐ బ్యాంకు నుంచి జానకి ప్రధాన్ పేరుతో ఉన్న ఖాతాకు బదిలీ చేసారని, అనంతరం జూలై 15 నుండి ఆగస్టు 12 మధ్య వివిధ ఖాతాలకు మొత్తంగా రూ.53.99 లక్షలు పంపారని తెలిపారు.
వర్చువల్ లాభాలు చూపించి నమ్మించారు
ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు యాప్‌లో రూ.90.72 లక్షల లాభం వచ్చినట్లు చూపించి మరిన్ని పెట్టుబడులు పెట్టమని ప్రేరేపించారు. అనంతరం క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఐపీఓలో 6 వేల షేర్లు కేటాయించామంటూ రూ.27 లక్షల లాభం వస్తుందని, లాభాల విడుదల కోసం మరో రూ.5 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేశారు.
సోమశేఖర్ ఆగస్టు 12న డబ్బులు వెనక్కు తీసుకోవడానికి ప్రయత్నించగా యాప్‌లో అన్ని ఆప్షన్లు నిలిపివేసి, వాట్సాప్ గ్రూప్ కూడా మూసేశారు. తాను మోసపోయానని గ్రహించిన ఆయన సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.