fake cryptocurrency investment: బిట్‌కాయిన్‌ పెట్టుబడి పేరుతో ప్రభుత్వ ఉద్యోగికి మోసం

పరిచయస్తుడే రూ.1 కోటి గుంజాడని ఫిర్యాదు తన పేరుతో రుణాలు, బంగారు ఆభరణాలు పూచీకత్తు పెట్టించాడని ఆరోపణ

Update: 2025-10-29 16:49 GMT

హైదరాబాద్: మలక్‌పేట సలీం‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కె.రిషి కిరణ్‌ (32) సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు పరిచయమైన మైసరి సంతోష్‌ అనే వ్యక్తి బిట్‌కాయిన్‌ పెట్టుబడుల పేరుతో రూ.1 కోటి మోసం చేశాడని ఆరోపించారు.

పోలీసుల వివరాల ప్రకారం, సంతోష్‌ వాట్సాప్‌లో కిరణ్‌ను సంప్రదించి, తన వద్ద 2.064 బిట్‌కాయిన్లు ఉన్నాయని, వాటి విలువ 2,58,461 అమెరికన్‌ డాలర్లని తెలిపాడట. ఎస్క్రో ఖాతా సమస్యలతో వాటిని తిరిగి పొందడంలో ఇబ్బంది పడుతున్నానని చెప్పి కిరణ్‌ సాయం కోరాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తదనంతరం సంతోష్‌, కిరణ్‌ నమ్మకం పొందుతూ, తన పేరుతో బ్యాంకుల నుంచి రూ.35 లక్షల రుణాలు తీసుకోవాలని ప్రేరేపించాడు. బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ ‘పాక్స్‌ఫుల్‌’ ద్వారా వాయిదాలు చెల్లిస్తానని హామీ ఇచ్చాడని కిరణ్‌ తెలిపారు. ఆపై రూ.6 లక్షల విలువైన ఆరు క్రెడిట్‌ కార్డులను కూడా వాడి చెల్లింపులు చేయలేకపోయాడట.

తరువాత మరో రూ.25 లక్షలు తీసుకొని 57 తులాల బంగారం మణప్పురం, ముత్తూట్‌ ఫైనాన్స్‌లలో పూచీకత్తు పెట్టించాడని, తర్వాత ఖైర్‌తాబాద్‌లోని వి గోల్డ్‌లో అమ్మేశాడని కిరణ్‌ తెలిపారు. ఆ మొత్తమంతా ‘బైనాన్స్‌, పాక్స్‌ఫుల్‌’ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పెట్టుబడిగా పెట్టాడని చెప్పారు.

తన డబ్బు ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదని కిరణ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. “డబ్బు ట్రేడింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లో ఇరుక్కుపోయిందని, త్వరలో ఇస్తానని చెబుతున్నాడు. కానీ ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు” అని ఆయన తెలిపారు.

సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News