పండగల వేళ.. ఆన్లైన్‌ షాపింగ్‌ చేస్తూ.. మోసపోవద్దు!

పండగల సమయంలో ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారు సాధారణ సమయాల్లో కన్నా ఎక్కువగానే ఉంటారు. దుస్తులు, ఇంట్లోకి కావాల్సిన సరకులు, ఎలక్ట్రానిక్‌

Update: 2025-09-24 12:01 GMT

పండగల సమయంలో ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారు సాధారణ సమయాల్లో కన్నా ఎక్కువగానే ఉంటారు. దుస్తులు, ఇంట్లోకి కావాల్సిన సరకులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఇలా.. వీటిపైన ఆకర్షణీయమైన తగ్గింపు ధరలు, మంచి ఆఫర్లు, అనేక ఇతర ప్రయోజనాలు ఉండటంతో చాలామంది ఆన్లైన్‌ షాపింగ్‌ చేసేందుకు, ప్రియమైనవారికి బహుమతులుగా ఇచ్చేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ల్లో కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. అయితే ఇదే అదనుగా తీసుకుని సైబర్‌ నేరగాళ్లు ఫేక్ పార్సిళ్లు, ఆర్డర్‌ బుక్‌ అయిందంటూ మోసానికి తెరతీస్తారు. ఇలా పండగల సమయంలో మోసాల ప్రమాదం తీవ్రంగా ఉంటుందంటున్నారు సైబర్‌ క్రైమ్‌ నిపుణులు. ఇటువంటప్పుడు కాస్త అప్రమత్తత అవసరం. మీ డబ్బు, సమాచారం, పండగ సంబరాన్ని పండగల సమయాల్లో కాపాడుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే...


ముందు గుర్తించాల్సినవి..

*మీరు చేయని కొనుగోళ్లకు సంబంధించి డీటైల్స్‌ వెరిఫై చేయాల్సిందిగా కొన్ని సందేశాలు పంపిస్తారు. అలాంటప్పుడు వెంటనే రియాక్ట్‌ అవ్వకూడదు. ఎందుకంటే ఆ సమయంలో మిమ్మల్ని అటెన్షన్‌ గా ఉంచేందుకు 'వెంటనే స్పందించండి' లేకపోతే 'మీ ఆర్డర్‌ క్యాన్సిల్‌ అవుతుంది, డబ్బు రిఫండ్‌ అవ్వదు' అంటూ పలు కారణాలు చెబుతారు.

*మీకు పండగ గిఫ్ట్ కార్డులను పంపిస్తామంటూ చెప్పి, వారికి కావాల్సిన వివరాలను తెలివిగా రాబట్టుకుంటారు. ఈ మోసాలు సాధారణంగా ఇ-మెయిల్, ఎస్ఎంఎస్, ఇతర మెసేజింగ్ యాప్ లు లేదంటే ఫోన్ ల ద్వారా జరుగుతాయి.

*మిమ్మల్ని ఇంకా నమ్మించేందుకు పేరున్న ఏదైనా బ్రాండ్‌, ఇ-కామర్స్ సేవా కేంద్రం నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మించే ప్రయత్నం చేస్తారు. సో బీ కేర్‌ఫుల్‌.

ఏం చేయాలి..?

*ఏదైనా లింక్‌ మీద క్లిక్ చేసే ముందు లేదా ఏదైనా మెసేజ్ కి స్పందించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

*ఏ సంస్థలు కూడా ఎప్పుడూ మీ బ్యాంకు వివరాలను అడగవు. అలానే వెంటనే స్పందించండని కూడా అడగవు. ఇవి గుర్తుంచుకోండి.

* మీ ఆర్డర్‌ స్థితిని తెలుసుకునేందుకు కేవలం అధికారిక వెబ్సైట్లను మాత్రమే సంప్రదించాలి. అక్కడ మీ ఆర్డర్‌ స్టేటస్‌ ఏంటనేది క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి విడిగా వచ్చే లింకులను అస్సలు నమ్మొద్దు, వాటిని ఓపెన్‌ చేయవద్దు.

*ఆధికారిక వెబ్సైట్‌ లేదంటే యాప్‌ లో మాత్రమే వెరిఫైడ్‌ చెల్లింపులు చేయండి.

*గిఫ్ట్ కార్డులు ఇస్తామంటూ చెప్పేవారి మాటలు నమ్మొద్దు, మీ ఆన్లైన్ షాపింగ్ ఖాతాల సెక్యూరిటీ కోసం బలమైన, ప్రత్యేకమైన పాస్వర్డ్‌ లను ఉపయోగించండి. రెండంచెల భద్రతను వాడటం ఇంకా మంచిది.

*ఒకవేళ మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయండి.

Tags:    

Similar News