శ్రీహరి కోటలో కలకలం రేపుతోన్న జవాన్ల ఆత్మహత్యలు

రాత్రి 8.30 గంటల సమయంలో అత్యవసర భద్రతా దళ (క్యూఆర్టీ) సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ..

Update: 2023-01-17 05:21 GMT

two jawan suicide at shar

తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో 24 గంటల వ్యవధిలో ఇద్దరు జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. వీరిద్దరూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి (సీఐఎస్ఎఫ్) చెందినవారే కావడం గమనార్హం. మృతుల్లో ఒకరి స్వస్థలం ఛత్తీస్ గఢ్ కాగా.. మరొకరిది ఉత్తర ప్రదేశ్. చత్తీస్‌గఢ్‌లోని మహాసమంద్ జిల్లా శంకర గ్రామానికి చెందిన చింతామణి (29) 2021లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. శిక్షణ అనంతరం శ్రీహరికోటలో సీఐఎస్ఎఫ్ జవాన్ గా విధుల్లో చేరాడు.

చింతామణి ఇటీవలే నెలరోజుల పాటు సెలవుపై ఇంటికి వెళ్లాడు. తిరిగి జనవరి 10న యధావిధిగా విధులకు హాజరయ్యాడు. ఆదివారం (జనవరి 15) మధ్యాహ్నం 1 గంటకు విధులకు హాజరయ్యాడు. అదే రోజు రాత్రి 7.30 గంటల సమయంలో కంట్రోల్ రూమ్ సిబ్బందితోనూ మాట్లాడాడు. కానీ అంతలోనే.. ఏమైందో ఏమోగానీ.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి 8.30 గంటల సమయంలో అత్యవసర భద్రతా దళ (క్యూఆర్టీ) సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో చింతామణి ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. అతడిని చూసి పెట్రోలింగ్ సిబ్బంది ఖంగుతిన్నారు. కుటుంబ సమస్యలతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్థారించారు.
చింతామణి ఘటన జరిగి 24 గంటలైనా కాకుండానే.. షార్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వికాస్ సింగ్ (30).. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షార్ మొదటి గేటు వద్ద కంట్రోల్ రూములో విధుల్లో ఉన్న ఎస్సై వికాస్ సింగ్ తన తుపాకితో తలపై కాల్చుకున్నాడు. తుపాకి పేలిన శబ్దం విన్న సిబ్బంది పరుగు పరుగున కంట్రోల్ రూమ్ కి వెళ్లి చూడగా.. వికాస్ రక్తపు మడుగులో కనిపించాడు. వికాస్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వికాస్ సింగ్ ఆత్మహత్యకు గల ప్రధాన కారణమేంటో తెలియరాలేదు. ఇద్దరు జవాన్ల బలవన్మరణాలపై పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు జవాన్ల మృతదేహాలకు పోస్టుమార్టమ్ అనంతరం.. కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.


Tags:    

Similar News