భారీ దారి దోపిడి.. కారును ఆపి రూ.3 కోట్లు దోచుకెళ్లిన దొంగ‌లు

కారులో వెళ్తున్నవారిని దుండ‌గులు అట‌కాయించి క‌త్తితో బెదిరించి రూ.3 కోట్లు దోచుకున్నారు.

Update: 2022-05-18 06:17 GMT


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లా దోర్నాల వ‌ద్ద భారీ దారి దోపిడీ జ‌రిగింది. కారులో వెళ్తున్నవారిని దుండ‌గులు అట‌కాయించి క‌త్తితో బెదిరించి రూ.3 కోట్లు దోచుకున్నారు. గుజ‌రాత్‌కు చెందిన కాలురామ్‌, అర‌వింద్ కారులో క‌లక‌త్తా నుంచి క‌ర్ణాట‌క‌లోని హోస్‌పేట‌కు వెళ్తున్నారు. సోమ‌వారం అర్థ‌రాత్రి స‌మ‌యంలో దోర్నాల మండ‌లం య‌డ‌వ‌ల్లి వ‌ద్ద అట‌వీప్రాంతంలోకి రాగానే కొంద‌రు దుండ‌గులు కారులో వ‌చ్చి వీరి కారును అడ్డ‌గించారు.

బాధితుల కారును ప‌క్క‌నే ఉన్న బ‌లిజేప‌ల్లి ర‌హ‌దారిలోకి మ‌ళ్లించారు. కొంత‌దూరం వెళ్లిన త‌ర్వాత కారులోని వారిని క‌త్తితో బెదిరించి వారి వ‌ద్ద ఉన్న రూ.3 కోట్ల‌ను దోచుకెళ్లారు. అనంత‌రం కారు తాళాల‌ను చెట్ల‌లోకి విసిరేసి పారిపోయారు. దీంతో కాలిన‌డ‌క‌న వెళ్తున్న బాధితుల‌ను చూసిన అట‌వీ సిబ్బంది వివ‌రాల‌ను తెలుసుకొని పోలీసుల‌కు సమాచారం అందించారు.

ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. కారుపైన నిందితుల వేలిముద్ర‌ల‌ను సేక‌రించారు. అయితే, బాధితుల నుంచి వివ‌రాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. పొంత‌న లేని స‌మాధానాలు చెబుతున్నారు. దీంతో పోలీసులు బాధితుల వ్య‌వ‌హారంపైనా అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం కేసు విచార‌ణ‌లో ఉంది. బాధితులు డ‌బ్బుతో వెళ్తున్న విష‌యం తెలిసిన వారే ఈ ప‌ని చేశారా అనే కోణంలో విచార‌ణ జ‌రుగుతోంది.


Tags:    

Similar News