వినుత అంత పగ పెంచుకోవడానికి కారణమేంటి? జరిగిన వాస్తవాలు వింటే?
జనసేన శ్రీకాళహస్తి ఇన్ ఛార్జిగా ఉన్న కోట వినుత తన డ్రైవర్ గా పనిచేసిన రాయుడిని హత్య చేయడం వెనక అనేక కారణాలు కనిపిస్తున్నాయి
జనసేన శ్రీకాళహస్తి ఇన్ ఛార్జిగా ఉన్న కోట వినుత తన డ్రైవర్ గా పనిచేసిన రాయుడిని హత్య చేయడం వెనక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. పోలీసులు చెప్పే కథనంతో పాటు వారి సన్నిహతులు చెప్పే వివరాలు ప్రకారం అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. శ్రీకాళహస్తి మండలం బొక్కిన పాలెం గ్రామానికి చెందిన రాయుడు అసలు పేరు శ్రీనివాసులు. అతను జనసేన శ్రీకాళహస్తి ఇన్ ఛార్జి వినుత వద్ద డ్రైవర్ గా పని చేస్తుండేవారు. అయితే పదేళ్లుగా వినుత వద్దనే డ్రైవర్ గా పనిచేస్తుండేవారు. కేవలం డ్రైవర్ గా మాత్రమే కాదు. అసిస్టెంట్ గా పనిచేసేవారు. అయితే కొద్ది రోజుల క్రితం రాయుడిని డ్రైవర్ గా తొలగిస్తున్నట్లు వినుత సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
సెల్ ఫోన్ చూసి...
వినుత గదిలో రహస్యంగా ఫోన్ తో చిత్రీకరించారని మంచం కింద సెల్ ఫోన్ ను చూసిని వినుత దంపతులు అది రాయుడిగా గుర్తించి ఆగ్రహానికి గురయ్యారు. పిలిచి అడగ్గా ఎక్కడో పడిపోయిందని అబద్ధాలు ఆడేందుకు రాయుడు ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో వినుత ఆమె భర్త చంద్రబాబు తెలిపారు. అయితే వినుత కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు శ్రీకాళహస్తి అధికార పార్టీనేతకు చెందిన అనుచరులకు అందచేస్తుండేవాడని, వారి నుంచి నగదు తీసుకునేవాడని కూడా పోలీసుల విచారణలో వినూత దంపతులు చెపపారు. దీంతో గత నెల 21వ తేదీన రాయుడిని హెచ్చరించి బయటకు పంపించారు. నాలుగు రోజుల తర్వాత తిరిగి ఇంటికి పిలిపించుకుని నాలుగు రోజుల తమ ఇంట్లోనే నిర్భంధించి కొట్టారని చెన్నై పోలీసులు తెలిపారు.
చంపేసి కూపం నదివద్ద...
ఈ నెల 7వ తేదీ ఉదయం 8.30 గంటల సమయంలో రాయుడు హత్యకు గురయి ఉండవచ్చని, హత్య చేసిన తర్వాత రాయుడి మృతదేహాన్ని కారులో తమిళనాడు సరిహద్దు ప్రాంతానికి తరలించారు. తమిళనాడు సరిహద్దులో వీరు ప్రయాణిస్తున్న వాహనం చెడిపోవడంబతో తిరిగి మరో కారును రప్పించి అందులోకి డెడ్ బాడీని మార్చి కూపం నది వద్ద పడేసి వెళ్లిపోయారని చెన్నై పోలీస్ కమిషనర్ అరుణ్ తెలిపారు. మృతదేహాన్ని చూసి తమకు అనుమానం వచ్చి పోస్టుమార్టం నిర్వహించగా హత్య అని నిర్ధారణ అయిందని, ఈ కేసులో జనసేన పార్టీ ఇన్ ఛార్జి వినుత తో పాటు ఆమె భర్త చంద్రబాబు, మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో వినుత సహాయకుడు గోపి, కారు డ్రైవర్ దాసన్, జనసేన ఐటీ వింగ్ ఇన్ ఛార్జి శివకుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని పులాల్ జైలుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే జనసేన పార్టీ వినుతను పార్టీ ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించడమే కాకుండా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.