మురుగేశన్.. మాదకద్రవ్యాల మురుగేశన్.. రాపిడోలో డెలివరీ చేసెన్

తెలివిగా రాపిడోలో కస్టమర్లకు గంజాయిని డెలివరీ ఇచ్చేవాడు మురుగేశన్. ఇటీవలి కాలంలో అతడు మరోసారి తన పాత పంథాను వదలకపోవడంతో పోలీసులు అతడిని పట్టేసుకున్నారు.

Update: 2022-05-18 05:07 GMT

మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిని పట్టుకోడానికి పోలీసులు చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ స్మగ్లర్లు ఎప్పటికప్పుడు ప్లాన్ లు మారుస్తూ డెలివరీ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తే ఈ మురుగేశన్..ఇప్పటికే రెండు సార్లు పట్టుబడ్డాడు.. అయినా కూడా అతడిలో మార్పు రాలేదు. తెలివిగా రాపిడోలో కస్టమర్లకు గంజాయిని డెలివరీ ఇచ్చేవాడు మురుగేశన్. ఇటీవలి కాలంలో అతడు మరోసారి తన పాత పంథాను వదలకపోవడంతో పోలీసులు అతడిని పట్టేసుకున్నారు.


చేతిలో ఫోన్‌, జేబులో గంజాయి పెట్టుకుని నగరమంతా తిరిగి గంజాయిని అమ్ముతున్నాడనే సమాచారం అందుకున్న రాచకొండ మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు కాప్రా శంకరమ్మ కాలనీకి చెందిన మునియాడీ మురుగేశన్‌ను మంగళవారం నాడు అరెస్టు చేశారు. గంజాయి డెలివరీ కోసం సొంత వాహనం వాడితే పోలీసులకు దొరికిపోతూ ఉండడంతో.. స్మగ్లింగ్‌ను ఎవరూ గుర్తించకుండా ఉండాలంటే రాపిడో ట్రావెలింగ్‌ ను ఎంచుకున్నాడు. గంజాయి తీసుకునేందుకు, వినియోగదారులకు డెలివరీ చేసేందుకు రాపిడోలో వెళ్ళేవాడు. రాపిడో ద్వారా ప్రతి రోజు 20 మందికి గంజాయి డోర్‌ డెలివరీ చేస్తూ ఉండేవాడు. సుమారు 200 రాపిడో బుకింగ్‌ల ద్వారా నగరంలో డెలివరీ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. ధూల్‌పేట్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువస్తున్న మురుగేశన్‌ వాటిని చిన్న చిన్న ప్యాకెట్లలో 15 గ్రాములు నింపుతున్నాడు. ఆ ప్యాకెట్లను రూ.400 నుంచి 600లకు ఒకటి చొప్పు న అమ్ముతూ ఉన్నాడు. ఇక సిగరెట్లుగా మార్చి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తెలిసింది. గంజాయి సరఫరా చేస్తూ గతంలో రెండు సార్లు పట్టుబడిన మురిగేశన్‌ మూడోసారి దొరకకూడదని వేరే ప్లాన్ వేసినా కూడా అడ్డంగా దొరికిపోయాడు. నిందితుడి దగ్గర నుండి 1.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రోలింగ్ పేపర్లను, రెండు మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మురుగేశన్ ఎవరెవరికి గంజాయి అమ్మాడో కూడా పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు.


Tags:    

Similar News