బీటెక్ చదువుతూ బుల్లెట్ బైక్స్ ను కొట్టేస్తూ!!
అందరూ ఇంజనీరింగ్ విద్యార్థులే, యూట్యూబ్ లో వీడియోలను చూసి బైక్స్ ను దొంగిలించడం ఇంత సులువా అని అనుకున్నారు.
అందరూ ఇంజనీరింగ్ విద్యార్థులే, యూట్యూబ్ లో వీడియోలను చూసి బైక్స్ ను దొంగిలించడం ఇంత సులువా అని అనుకున్నారు. బుల్లెట్ బైక్స్ తాళాలు ఎలా తీయాలో నేర్చుకొని దొంగతనాలు చేస్తూ వచ్చారు. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఇదే పనిలో ఉండగా అద్దంకి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 25 లక్షలకు పైగా విలువైన 16 బుల్లెట్‌లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా కందుకూరులోని ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ చదువుతున్నారు. వీరు ఒంగోలు వీఐపీ రోడ్డులో గది అద్దెకు తీసుకుని కళాశాలలకు వెళ్లి వస్తున్నారు. వ్యసనాలకు బానిసలైన వీరు డబ్బులు సంపాదించాలని బైక్స్ దొంగతనం చేయడం మొదలుపెట్టారు. శింగరకొండ తిరునాళ్ల నుంచి ఇప్పటి వరకు 17 ద్విచక్రవాహనాలను దొంగతనం చేశారని పోలీసులు తెలిపారు. ఒకే తరహాలో బుల్లెట్‌లు అపహరణకు గురికావడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుల ఆచూకీ తెలుసుకున్నారు. అపహరించిన ద్విచక్ర వాహనాలను అద్దంకి పట్టణ శివారు బ్రహ్మానందం కాలనీలో దాచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.