నిత్యపెళ్లికొడుకుగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. వారంలో నాలుగో పెళ్లికి రెడీ

కొద్దిరోజులు అక్కడే ఉండి.. తన మాయమాటలతో ఆమెను నమ్మించాడు. పెళ్లిచేసుకుంటానని చెప్పి జనవరి 4న తన ఇంటికి పిలిపించాడు.

Update: 2023-01-30 13:21 GMT

ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి నిత్యపెళ్లికొడుకుగా మారాడు. మూడో పెళ్లి చేసుకున్న వారంరోజుల్లోనే నాలుగోపెళ్లికి మ్యాటిమోనీలో దరఖాస్తు చేసుకోవడంతో అతని బాగోతం బయటపడింది. కంటోన్మెంట్ లోని దిల్ ఖుష్ నగర్ నగర్ కు చెందిన వంశీకృష్ణ (39) హైటెక్ సిటీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అతనికి గతంలోనే రెండు పెళ్లిళ్లవ్వగా ఇద్దరికీ విడాకులిచ్చి.. మూడో పెళ్లికి ఓ మ్యాట్రిమోనీలో దరఖాస్తు చేసుకున్నాడు. అదే సమయంలో నెల్లూరుకు చెందిన ఓ వైద్యురాలు తన భర్త చనిపోవడంతో.. కుటుంబ సభ్యుల అనుమతితో అదే మ్యాట్రిమోనీలో వరుడికోసం దరఖాస్తు చేసుకుంది.

ఈ క్రమంలో వంశీకృష్ణకు ఆమెతో పరిచయమైంది. ఆమెను కలిసేందుకు నెల్లూరు వెళ్లాడు. కొద్దిరోజులు అక్కడే ఉండి.. తన మాయమాటలతో ఆమెను నమ్మించాడు. పెళ్లిచేసుకుంటానని చెప్పి జనవరి 4న తన ఇంటికి పిలిపించాడు. ఇప్పటికే.. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. ఈసారి ఎలాంటి ఆర్భాటం లేకుండా పెళల్లి చేసుకుందామని నమ్మించి తాళికట్టాడు. వారంరోజుల పాటు ఇద్దరూ అన్యోన్యంగా గడిపారు. అనంతరం ఆమె నెల్లూరుకు వెళ్లి.. తిరిగి 24 వంశీకృష్ణ ఇంటికి వచ్చింది. అతను మొహం చాటేసేందుకు ప్రయత్నించడంతో.. తాను మోసపోయానని గ్రహించింది.
వెంటనే పోలీసులకు విషయం చెప్తానని అనడంతో ఆమెను రెండ్రోజులపాటు గదిలో నిర్బంధించాడు. ఇంతలోనే మరో వివాహం చేసుకునేందుకు అదే మ్యాట్రిమోనీలో దరఖాస్తు చేసుకున్నాడు వంశీకృష్ణ. అతడి దరఖాస్తును పరిశీలించిన మ్యాట్రిమోనీ ప్రతినిధులు అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు బాధితురాలికి ఫోన్ చేశారు. ఆమె జరిగిందంతా వాళ్లకు వివరించింది. నిందితుడి ఇంటి నుండి బయటపడిన ఆమె మ్యాట్రిమోని ప్రతినిధులతో కలిసి ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడికి అతని కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.







Tags:    

Similar News