వీధి కుక్కల దాడిలో మరో ఇద్దరు చిన్నారులు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు రెండు రోజుల వ్యవధిలో కుక్కల దాడిలో..

Update: 2023-03-13 13:46 GMT

siblings killed in dogs attack

తెలంగాణలోని హైదరాబాద్ లో ఇటీవల వీధి కుక్కల దాడిలో ఓ బాలుడి మరణించిన ఘటన మరువక ముందే.. దేశ రాజధాని ఢిల్లీలో మరో విషాద ఘటన జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు రెండు రోజుల వ్యవధిలో కుక్కల దాడిలో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని సింధి క్యాంపులో ఆనంద్ (7), ఆదిత్య(5) అనే ఇద్దరు చిన్నారులు వీధికుక్కల దాడిలో మరణించారు. వీరిద్దరినీ రెండ్రోజుల వ్యవధిలో కుక్కలు కరిచి చంపాయి. మార్చి 10వ తేదీన ఆనంద్ ఆడుకుంటూ సమీపంలోని అటవీప్రాంతానికి వెళ్లగా.. అక్కడ వీధికుక్కలు దాడిచేశాయి. ఆడుకునేందుకు వెళ్లిన కొడుకు ఎంతకూ తిరిగి రాకపోవడంతో.. తల్లి పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు రెండుగంటల పాటు గాలించగా.. ఓ ఖాళీ స్థలంలో శరీరం నిండా గాయాలతో ఉన్న బాలుడి మృత దేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం బాలుడిని ఆసుపత్రికి తరలించగా కుక్కల దాడిలోనే మరణించినట్లు నిర్థారించారు. ఆనంద్ చనిపోయిన రెండరోజుల తర్వాత.. తమ్ముడు ఆదిత్య పై కూడా కుక్కలు దాడిచేశాయి. తీవ్రంగా గాయపడిన ఆదిత్యను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. ఆదిత్య కూడా మృతి చెందడంతో.. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రెండ్రోజుల వ్యవధిలో కుక్కల దాడుల్లో ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వీధుల్లో కుక్కలను కట్టడి చేయాలని, వాటిని నియంత్రించాలని స్థానికులు మున్సిపల్ సిబ్బందిని కోరుతున్నారు.


Tags:    

Similar News