మిస్టరీగా మారిన విద్యార్థి మిస్సింగ్ కేస్

సంగారెడ్డి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విద్యార్థి కార్తీక్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా.. అతను విజయవాడ..

Update: 2023-07-24 07:54 GMT

హైదరాబాదులో ఐఐటి చదువుతున్న విద్యార్థి మిస్సింగ్ కేస్ మిస్టరీగా మారిపోయింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తిక్ (21) అనే యువకుడు హైదరాబాదులోని ఐఐటీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ నెల 17వ తేదీన కార్తీక్ ఐఐటి క్యాంపస్ నుండి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. కార్తీక్ కు తల్లిదండ్రులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో కంగారు పడిన తల్లిదండ్రులు ఈ నెల 19వ తేదీన క్యాంపస్ కి వచ్చారు. కానీ కార్తీక్ క్యాంపస్ లో లేకపోవడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకై కాలేజీ యజమాన్యాన్ని నిలదీసి అడిగారు. 17వ తేదీన బైటికి వెళ్లిన కార్తీక్ తిరిగి రాలేదు అన్న విషయాన్ని తమకు చెప్పాల్సిన బాధ్యత లేదా అంటూ కాలేజీ యజమాన్యాన్ని కార్తీక్ తల్లిదండ్రులు నిలదీశారు. ఇందుకు కాలేజీ యజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళన చెందిన కార్తీక్ తల్లిదండ్రులు వెంటనే సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంగారెడ్డి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విద్యార్థి కార్తీక్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా.. అతను విజయవాడ వెళ్ళినట్లుగా గుర్తించారు. అనంతరం సంగారెడ్డి పోలీసులు కార్తీక్ తల్లిదండ్రులను తీసుకొని వైజాగ్ వెళ్లారు. కార్తీక్ వైజాగ్ లోని బీచ్ లో తిరిగినట్లు అక్కడ ఉన్న బేకరీలో ఫుడ్ తిన్నట్లుగా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను చూసిన అనంతరం పోలీసులు, కార్తీక్ తల్లిదండ్రులు గత ఆరు రోజులుగా వైజాగ్ లోనే ఉన్నారు. ఇంతవరకు కార్తీక్ గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పోలీసులు కార్తీక్ కోసం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు.


Tags:    

Similar News