రోడ్డు ప్రమాదంతో... కరడు గట్టిన నేరగాడు అరెస్ట్
యాక్సిడెంట్ పదిహేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పట్టించింది
యాక్సిడెంట్ పదిహేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పట్టించింది. నంద్యాల జిల్లాకు చెందిన తెలుగు మల్లెపూల నాగిరెడ్డి తన పద్దెనిమిదో ఏట చోరీలను ప్రారంభించాడు. మొత్తం అనేక రాష్ట్రాల్లో 45 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి మండలం వీరాపురానికి చెందిన నాగిరెడ్డి చోరీలలో అందెవేసిన చేయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అనేక దొంగతనాలకు పాల్పడ్డాడు. పదిహేనేళ్ల నుంచి పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్నాడు. పరారవ్వడంలో దిట్ట అయిన నాగిరెడ్డిని పట్టుకునేందుకు పదిహేనేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
పోలీసులకు చిక్కినట్లే చిక్కి...
పోలీసులకు చిక్కి నాగిరెడ్డి తప్పించుకోవడంతో పదకొండు మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. గత పదిహేనేళ్లుగా పోలీసులు గాలిస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు కన్ను గప్పి పరారయ్యేవాడు. 2023లో కడప జిల్లాలో పోలీసులకు చిక్కి వెంటనే తప్పించుకున్నాడు. ఈ ఘటనలోనే పోలీసులు సస్పెన్షన్ కు గురయ్యారు. అయితే అనూహ్యంగా ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడి పోలీసులకు నాగిరెడ్డి దొరికిపోయాడు. ఈసారి నాగిరెడ్డిని భారీ భద్రత మధ్య పోలీసులు న్యాయస్థానానికి తరలించారు.
కారులో వస్తూ...
ఈ నెల 4వ తేదీన అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగిరెడ్డి గాయపడ్డాడు. కారులో వెళుతూ ఎదురుగా వస్తున్న మరొక వాహనాన్ని ఢీకొట్టడంతో నాగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. మరొక వాహనంలో ఉన్న ఇద్దరు ఈ ప్రమాదంలో మరణించారు. నాగిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. నాగిరెడ్డి కారులో మూడు లక్షల రూపాయలతో పాటు బంగారు ఆభరణాలు కూడా దొరికాయి. భారీ బందోబస్తు మధ్య నాగిరెడ్డికి చికిత్స అందించి ఉరవకొండ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.న్యాయమూర్తి నాగిరెడ్డికి రిమాండ్ విధించారు. నాగిరెడ్డిని అనంతపురం జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు.