murder : అప్పు తీర్చడం కోసం అన్న ప్రాణాలను తీసిన తమ్ముడు
ముందస్తుగా బీమా చేయించిన తమ్ముడు తన అన్ననే హత్య చేశాడు.
మాయమయిపోతున్నాడమ్మా.. మనిషన్నవాడు.. అని అందెశ్రీ రాసిన గేయం వాస్తవ రూపం దాలుస్తున్నట్లు కనిపిస్తుంది. బీమా డబ్బుల కోసం తోడబుట్టిన వాడిని చంపిన ఘటన జరిగింది. ముందస్తుగా బీమా చేయించిన తమ్ముడు తన అన్ననే హత్య చేశాడు. కోట్ల రూపాయలు అప్పులు చేసిన తమ్ముడు తన బాకీలను చెల్లించడం కోసం అన్నను ఎరగా వేశాడు. పోలీసుల కథనం ప్రకారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది. మామిడి నరేశ్ అనే యువకుడు వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. 1.50 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. అప్పుల వాళ్లు తమకు తిరిగి చెల్లించాలని వత్తిడి తెస్తున్నారు.
బీమా చేయించి మరీ...
దీంతో నరేశ్ తన సోదరుడు వెంకటేశ్ పేరు మీద నాలుగు జీవిత బీమా సంస్థల్లో నాలుగు కోట్ల మేరకు బీమా చేయించాడు. తన సోదరుడు వెంకటేశ్ ను హత్య చేస్తే తనకు 4.14 కోట్ల రూపాయలు వస్తాయని స్కెచ్ వేసి సోదరుడి ప్రాణం తీయడానికి సిద్ధమయ్యాడు. తనకు ఏడు లక్షల రూపాయలు ఇచ్చిన రాకేశ్ అనే వ్యక్తితో తన సోదరుడు వెంకటేశ్ హత్యకు పన్నాగం పన్నాడు. తన సోదరుడిని హత్య చేస్తే అప్పుగా తీసుకున్న ఏడు లక్షల రూపాయలతో పాటు మరో ఎనిమిది లక్షలు అదనంగా ఇస్తానని చెప్పాడు. తనకు పదమూడు లక్షలు వస్తాయని భావించిన రాకేశ్ ఈ హత్యకు సహకరించాడు. అందుకు లారీతో తొక్కించి చంపాలని ప్లాన్ వేశాడు.
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి...
అనుకున్నట్లుగానే ఈ నెల 29వ తేదీన తన టిప్పర్ ఆగిపోయిందని చెప్పి తన సోదరుడు వెంకటేశ్ ను అక్కడకు పంపాడు. లారీ కింద జాకీ పెట్టాలని వెంకటేశ్ ను కింద పడుకుని చూడమన్నాడు. తర్వాత లారీని ముందుకు పోనిచ్చి వెంకటేశ్ ను హత్య చేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. బంధువులను కూడా అదే నమ్మించాడు. చివరకు నరేశ్, రాకేశ్ లు బీమా సొమ్ము కోసం ప్రయత్నించారు. వారికి అనుమానం వచ్చి ఆరా తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారించి ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్య అని తేల్చారు. నరేశ్ తో పాటు రాకేశ్ ఈ హత్యకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పు తీర్చుకోవడానికి అన్న ప్రాణాన్ని పణంగా పెట్టిన తమ్ముడి వ్యవహారంపై గ్రామంలో చర్చనీయాంశమైంది.