లోన్ యాప్ వేధింపులు.. భరించలేక యువకుడు సూసైడ్‌

ఆన్‌లైన్‌ లోన్ యాప్ ద్వారా రుణాలు తీసుకొని నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు గతంలో

Update: 2023-07-30 12:21 GMT

ఆన్‌లైన్‌ లోన్ యాప్ ద్వారా రుణాలు తీసుకొని నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు గతంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. అయితే పోలీసులు ఇలా ఆన్‌లైన్‌లో లోన్ యాప్ ద్వారా రుణాలు తీసుకొన్నవారు ఎటువంటి బెదిరింపులకు భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా కూడా కొంతమంది ఈ లోన్ యాప్ నిర్వాహకుల బేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి సంఘటనే శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లోన్ యాప్‌కి మరో యువకుడు బలి అయ్యాడు. లోన్ యాప్‌లో రుణం తీసుకొని వాటిని చెల్లించకపోవడంతో నిర్వాహకులు పెట్టిన వేధింపులు భరించలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్‌కి చెందిన నరేష్ అనే యువకుడు సంవత్సరం పాటు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తూ, అక్కడే దగ్గర్లో ఉన్న హాస్టల్లో నివాసం ఉంటున్నాడు.

నరేష్ కొన్ని కారణాల చేత ఆన్‌లైన్‌లో పలుమార్లు లోన్ తీసుకున్నాడు. ఆ విధంగా తీసుకున్న లోన్లు నరేష్ కట్టకపోవడంతో ఆన్‌లైన్‌ లోన్ ఆప్ నిర్వాహకులు బెదిరింపులకు గురి చేశారు. తీసుకున్న రుణం తిరిగి వెంటనే చెల్లించా‌లంటూ లేదంటే నీ గురించి తప్పుగా ప్రచారం చేస్తామంటూ వేధింపులకు గురి చేశారు. రోజు రోజుకి లోన్ ఆప్ నిర్వాహకుల వేధింపులు మితిమీరిపోవడంతో నరేష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో హాస్టల్ లో నివాసముంటున్న నరేష్ తన గదిలో ఎవరూ లేని సమయంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ నిర్వాహకులు వెంటనే ఎయిర్ పోర్ట్ పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. 

Tags:    

Similar News