హైదరాబాద్ లో పిల్లాడి ప్రాణం తీసిన నాలా

హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నాలాలు ఉప్పొంగుతున్నాయి

Update: 2023-09-05 14:59 GMT

హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నాలాలు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో ఓ బాలుడు నాలాలో పడి కొట్టుకుపోయిన ఘటన విషాదాంతం అయింది. నిజాంపేట రాజీవ్ గృహకల్ప వద్ద ఆ బాలుడి మృతదేహం తేలింది. కానీ అక్కడ్నించి మరోసారి కొట్టుకుపోయింది. బాచుపల్లి పరిధిలోని ఎన్నారై కాలనీ వద్ద ఆ బాలుడు నాలాలో పడిపోయాడు. బాలుడి కోసం తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టారు. నిజాంపేట రాజీవ్ గృహకల్ప వద్ద బాలుడి మృతదేహాన్ని గుర్తించిన అధికారులు, మృతదేహాన్ని బయటికి తీస్తుండగా, నీటి ఉద్ధృతికి మళ్లీ కొట్టుకుపోయింది. బాలుడి మృతదేహం నాలా ప్రవాహంతో పాటు తుర్క చెరువులోకి కొట్టుకుపోయింది. దాంతో అధికారులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. వారితో తుర్క చెరువులో గాలింపు చేపట్టారు. బాచుపల్లి నాలా కలిసే ప్రగతి నగర్‌ తుర్క చెరువులో డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చేపట్టగా మిథున్‌ మృతదేహం లభ్యమైంది.

బాచుప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ప్ర‌గ‌తి న‌గ‌ర్ ఎన్ఆర్ఐ కాల‌నీ వ‌ద్ద ఓ బాలుడు నాలాలో కొట్టుకుపోయాడు. నాలాలో కొట్టుకుపోయిన ఐదేళ్ల బాలుడు మిథున్.. నిజాంపేట్ రాజీవ్ గృహ‌క‌ల్ప వ‌ద్ద తేలాడు. అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు, డీఆర్ఎఫ్ బృందాలు బాలుడిని బ‌య‌ట‌కు తీసేందుకు య‌త్నించారు. కానీ ఆ ప్ర‌య‌త్నం విఫ‌లం కావ‌డంతో బాలుడు మ‌ళ్లీ చెరువులోకి కొట్టుకుపోయాడు. బాలుడు నాలాలో ప‌డిపోతున్న సీసీటీవీ ఫుటేజీ ల‌భ్య‌మైంది.


Tags:    

Similar News