గోల్డ్ ట్రేడర్ దగ్గర నుండి రెండు బంగారు ఇటుకలను కొట్టేశారు.. ఆ తర్వాత..!

వారి సహచరులను అరెస్టు చేయడంతో, ముగ్గురు వాంటెడ్ నిందితులు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లారు.

Update: 2022-08-13 04:41 GMT

ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం పలు నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసింది. ఈ దోపిడీ దొంగలకు సంబంధించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 50,000 నగదు రివార్డు ఇవ్వనున్నారు. నిందితులను ప్రమోద్ యాదవ్, మణిపాల్, దీపక్‌లుగా గుర్తించారు. ఈ ముగ్గురూ హత్య, హత్యాయత్నం, దోపిడీ వంటి అనేక క్రూరమైన నేరాలకు పాల్పడ్డారు. ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో కూడా వీరు దోపిడీకి పాల్పడ్డారు. తుపాకీతో గోల్డ్ ట్రేడర్ పై దాడి చేశారు. ఒక కిలోగ్రాము బరువున్న 2 బంగారు ఇటుకలను దోచుకున్నారు. అది కూడా పగటి పూట ఈ దోపిడీకి తెగబడడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ బృందం ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది.

2014లో పీఎస్‌ గీతా కాలనీలో 7.5 కిలోల బంగారం చోరీకి గురైన కేసులో నిందితులు బెయిల్‌పై ఉన్నారని రికార్డుల్లో తేలింది. ఆ తర్వాత కూడా వీళ్లు ఇదే తరహాలో చోరీకి పాల్పడినట్లు తేలింది. అజీత్, మహ్మద్ ఇక్బాల్, హర్ష్ అనే ముగ్గురు నేరస్థులు బంగారాన్ని ఎవరు అమ్ముతున్నారు.. తీసుకుని పోతున్నారు.. అనే విషయాలను గమనించి దోపిడీలో పాల్గొన్నారు. నిందితుల నుంచి 1 కిలోల బంగారం, 3.2 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా.. మరో ముగ్గురు నిందితులు ప్రమోద్, మణిపాల్ అలియాస్ అతుల్, దీపక్ చౌహాన్ లు కూడా ఈ దోపిడీలో భాగస్వామ్యులుగా ఉన్నారని అధికారులు గుర్తించారు.
వారి సహచరులను అరెస్టు చేయడంతో, ముగ్గురు వాంటెడ్ నిందితులు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లారు. ఢిల్లీ పోలీసులు వారికి సంబంధించిన సమాచారం అందించేవారికి ఒక్కొక్కరికి రూ. 50,000 నగదు బహుమతిని ప్రకటించారు. ముగ్గురు నిందితుల కదలికలకు సంబంధించి రహస్య సమాచారం అందడంతో ఎట్టకేలకు పోలీసులు నాలుగు నెలల పాటూ చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. ఆగస్ట్ 12, గురువారం మధ్య రాత్రి, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్- హాపూర్ జిల్లాల్లోని రెండు వేర్వేరు ప్రదేశాలలో రెండు బృందాలు ఏకకాలంలో సమన్వయంతో దాడులు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.


Tags:    

Similar News