Murder Case : భర్తను హత్య చేసి ప్రియుడితో జంప్ అయిన భార్య.. మహారాష్ట్రలో మరో ఘటన
భర్తను చంపి ఇంటిలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టిన భార్య ఉదంతం మహారాష్ట్ర జిల్లాలో జరిగింది
భర్తను హత్య చేస్తున్న ఘటనలు ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతున్నాయి. భార్యలే విలన్లుగా మారుతున్నారు. భర్తను చంపి ఇంటిలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టిన భార్య ఉదంతం మహారాష్ట్ర జిల్లాలో జరిగింది. మహారాష్ట్రలోని పాల్టర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం కలిగించింది. విచిత్రమేంటంటే ఈ హత్యలో కూడా భార్య తన ప్రియుడిని హత్యకు ఉపయోగించుకుంది. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు. హత్య జరిగిన విషయం తెలియకుండా పకడ్బందీగా ప్లాన్ వేసింది. రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనం కలిగించింది. ముంబయికి డెబ్భయి కిలోమీటర్ల దూరంలో విజయ్ చవాన్, కోమల్ లు కలసి ఉంటున్నారు.
ఇద్దరి జీవితంలోకి...
వీరిద్దరూ వివాహం చేసుకుని జీవిస్తున్నారు. అలాంటి కోమల్ జీవితంలోకి మరొక వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. తన ఇంటిపక్కనే ఉన్న మోను అనే యువకుడితో పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధాలకు దారి తీసింది. ఇద్దరూ కలసి ఉండటాన్ని భర్త విజయ్ చవాన్ చూశాడు. మందలించాడు. దీంతో భర్తకు తమ వివాహేతర సంబంధం తెలియడం, ఇకపై తాము కలుసుకోవడానికి అడ్డంకిగా ఉంటాడని భావించి కోమల్ భర్త విజయ్ చవాన్ హత్యకు ప్లాన్ చేసింది. తన ప్రియుడు మోను తో కలసి హత్యకు వేసిన స్కెచ్ చూసి పోలీసులే అవాక్కయ్యారు.
వారం రోజుల నుంచి కనిపించకపోవడంతో...
అయితే విజయ్ చవాన్ వారం రోజుల నుంచి కనిపించకపోవడంతో అతని సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కోమల్ హత్య చేసిన తర్వాత విజయ్ చవాన్ తన ఇంట్లోనే గొయ్యి తీసి పూడ్చిపెట్టి తర్వాత మోనుతో కలసి పరారయింది. సోదరులు, స్థానికులతో కలసి కోమల్ ఇంట్లో ఫ్లోరింగ్ రంగుల్లో తేడా ఉండటాన్ని గమనించిన పోలీసులు అనుమానించి ఆ టైల్స్ ను తొలిగించారు. లోపలి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మట్టిని తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో కోమల్, మోను కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరూ హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టి పరారయి ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.