Murder Case in Medchal : దారుణం.. భార్య శరీరాన్ని ముక్కలుగా నరికి.. హత్య చేసి సంచిలో కుక్కి?

మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గర్భవతితో ఉన్న భార్యను ముక్కలుగా నరికి చంపిన భర్త ఉదంతం కలకలం రేపింది

Update: 2025-08-24 04:24 GMT

మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గర్భవతితో ఉన్న భార్యను ముక్కలుగా నరికి చంపిన భర్త ఉదంతం కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా పరిధిలోని మేడిపల్లి పరిధిలోని బాలాజీహిల్స్ లో ఈ విషాదం నెలకొంది. వికారాబాద్ జిల్లాలోని కామారెడ్డిగూడకు చెందిన స్వాతి, మహేందర్ లవ్ మ్యారేజీచేసుకున్నారు. పెద్దలు అంగీకరించకపోయినా ఇద్దరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత బోడుప్పల్ లో నివాసం ఉంటున్నారు. మహేందర్ ఒక క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా భార్య, భర్తల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే అవి సర్దుకునేవి అని కూడా అంటున్నారు.

సంచిలో వేసుకుని...
భార్యపై అనుమానంతోనే మహేందర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ముక్కలుగా భార్య శరీరాన్ని నరికి ఒక సంచిలో వేసుకుని మూసీ నదిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. శరీరభాగాలను కవర్ లో ప్యాక్ చేసి బయటకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి పెద్దగా శబ్దాలు రావడంతో చుట్టుపక్కల ప్రజలు వెళ్లి చూశారు. వెంటనే వారికి అర్థమయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటనకు చేరుకుని విచారణ ప్రారంభించారు. కవర్ లో ఉన్న శరీర భాగాలను ఎక్కడ పడవేశారన్న దానిపై ఆరా తీసి వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
శరీర భాగాలను స్వాధీనం చేసుకోవడానికి...
పోలీసులు సీన్ రీ కనస్ట్రక్షన్ చేయడానికి సిద్ధమయ్యారు. నిందితుడు మహేందర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని భార్య శరీరభాగాలను కవర్ లో చుట్టి మూసీ నదిలో పడివేశానని చెప్పడంతో అక్కడకు తీసుకెళ్లి వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. విచారణలో నిందితుడు మహేందర్ భార్యను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అయితే హత్యకు గల కారణాలను మాత్రం చెప్పడం లేదు. కానీ అనుమానంతోనే చంపి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. అదే సమయంలో స్వాతి చుట్టుపక్కల వారితో సన్నిహితంగా ఉండటం ఓర్వలేక మహేందర్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.


Tags:    

Similar News